కేసీఆర్ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతోంది. తమ ఆదేశాలు అమలు కాకపోవడంతో కేసీఆర్ సర్కార్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా కేసులపై విచారణలో భాగంగా ఇటీవల పలు దఫాలు తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
కరోనా పరీక్షలు చేయకుండా ప్రజల్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా సోమవారం మరోసారి హైకోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. ప్రభుత్వం తమ ఆదేశాలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని మండిపడింది.
జూన్ 8వ తేదీ నుంచి తామిచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా అధికారులు అమలు చేయడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. నిన్నటి బులెటిన్‌లో కూడా సరైన వివరాలు వెల్లడించలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తమ ఆదేశాలు అమలు చేయని కారణంగా ఇక ఏం చేయాలో రేపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే అడుగుతామని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా కరోనా కేసులన్నింటిని రేపటికి వాయిదా వేసింది. కరోనా కేసుల విషయంలో హైకోర్టు వైఖరిపై ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ సమక్షంలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. తాజాగా తమ ఆదేశాలు అమలు కాలేదనడంతో పాటు ఏం చేయాలో సీఎస్‌నే అడుగుతామనడం ఆసక్తికరంగా మారింది.