లాక్ డౌన్ సడలింపు లో భాగంగా థి యేటర్లు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. సడలింపులో భాగంగా కేంద్రం కాస్త ఉదారంగానే ప్రవర్తిస్తోంది. కానీ అమలు చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టా ఇష్టాలకు వదిలేస్తోంది. మందు దుకాణాలు మీకు కావాలంటే తీసుకోండి. మాల్స్ మీకు కావాలంటే తెరుచుకోవచ్చు, ఈ విధంగా కేంద్రం చెబుతోంది. ఇప్పడు బహుశా థియేటర్ల విషయంలో కూడా ఇదే విధంగా చెప్పే అవకాశం వుంది.
కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచే పరిస్థితి వుందా? థియేటర్లు తెరిచినా జనం వస్తారా? జనం వచ్చినా వేయడానికి సరైన సినిమాలు వున్నాయా? పైగా కేంద్రం ప్రకటించే విధాన సూత్రాల ప్రకారం థియేటర్లు నడపడం సాధ్యమేనా? 25శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిస్తే ఏమేరకు లాభం? ఇవన్నీ ప్రశ్నలే.
థియేటర్లు మూసివేత వల్ల ఇప్పటికి ఎగ్జిబిటర్లకు ఆదాయం నష్టం సంగతి అలా వుంచితే, ఖర్చు పరంగా పెద్దగా లేదు. కొద్దిగా ఇస్తున్న జీతాలు, కరెంటు బిల్లు మాత్రమే. ఇదే కనుక థియేటర్లు ఓపెన్ చేస్తే, ఫుల్ గా జీతాలు ఇవ్వాలి. కరెంట్ బిల్లులు ఫుల్ గా ఇవ్వాలి. లీజుమొత్తాలు కట్టాలి. ఇదంతా 25 పర్సంట్ ఆక్యుపెన్సీతో చేయాలి. అందువల్ల సింగిల్ థియేటర్ ఓనర్ల సంగతి అలా వుంచితే, పెద్ద సంఖ్యలో థియేటర్లు చేతిలో వున్నారు, వాటిని తెరవడానికి రెడీ అవుతారా?
ఇదిలా వుంటే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల్లో కేసులు భయంకరంగా వున్నాయి. ఇప్పుడు థియేటర్ల వల్ల ఏమాత్రం ఈ కేసులు పెరిగిపోయినా, కరోనా అదుపు తప్పి పోతుంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం అనుమతి ఇచ్చినా, రాష్ట్రాలు ఓకె అంటాయా అన్నదీ అనుమానమే. జనాలకు కరోనా అంటే భయం పోయినా, సింగిల్ థియేటర్లకు వెళ్లడానికి ధైర్యం చేస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే ఆలయాలు ఓపెన్ చేసినా, మాల్స్ ఓపెన్ చేసినా, జనాలు పాతిక శాతానికి మించి వెళ్లడం లేదు ఆర్జీసీ బస్ లు ఖాళీగా తిరుగుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో థియేటర్లకు జనం వస్తారా?అన్నది అనుమానం. పైగా సినిమా థియేటర్లు తెరిచినా కంటెంట్ లేదు. సరైన కంటెంట్ లేకుండా థియేటర్ కు జనం రారు. పాతిక శాతం ఆక్యుపెన్సీ తో పెద్ద సినిమాలు కాదు, కనీసం మీడియం సినిమాలు కూడా విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ముందుకు రారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకుంటాయి అనడం కలే.