తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏసీబీ కోర్టు పోలీసులకు షాక్ ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టి వేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్టైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎలాగైనా బీజేపీని బుక్ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహ రచనతో ముందుకెళుతోంది.
ఈ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌తో పాటు పాటు తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చి ఏసీబీ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పీసీ యాక్ట్ అనుసరించి సంఘటనా స్థలంలో డబ్బు దొరకలేదని, అలాగే మెమోలో పేర్కొన్న నిందితులు అక్కడ లేరని ఏసీబీ కోర్టు పేర్కొంది. సంఘటన స్థలంలో లేని వారిని నిందితులుగా చేర్చడం ఏంటని ఏసీబీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో మెమోను కొట్టి వేసింది.
ఈ కేసులో భాగంగా నిందితుల మాటల్లో వారి పేర్లు వుండడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మరోవైపు సిట్ దర్యాప్తు చేపట్టింది. ఇంత వరకూ మెమోలో పేర్కొన్న నిందితులెవరూ విచారణకు హాజరు కాలేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఇదే కేసులో విచారణకు రావాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూడా సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించారని తెలిసి, ఇప్పుడు విచారణకు రావాల్సిన అవసరం లేదని, మరో దఫా పిలుస్తామని ఆయనకు సమాచారం ఇచ్చారు. తాజాగా ఏసీబీ కోర్టు మెమోను కొట్టేయడంతో బీఎల్ సంతోష్‌తో పాటు మిగిలిన నిందితులకు పెద్ద ఊరట దొరికినట్టే. దీనిపై పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారనేది చర్చనీయాంశమైంది.