ఎందుకీ ఊగిస‌లాట‌?

రాజ‌కీయాల్లో అంది వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని బ‌ల‌ప‌డాల‌ని చూస్తారు. కానీ జ‌న‌సేన వైఖ‌రి ఇందుకు భిన్నంగా ఉంటోంది. అందువ‌ల్లే న‌ష్ట‌పోతోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క రిస్తూ టీడీపీ నిర్ణ‌యం…

రాజ‌కీయాల్లో అంది వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుని బ‌ల‌ప‌డాల‌ని చూస్తారు. కానీ జ‌న‌సేన వైఖ‌రి ఇందుకు భిన్నంగా ఉంటోంది. అందువ‌ల్లే న‌ష్ట‌పోతోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క రిస్తూ టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. స‌హ‌జంగానే రెండోస్థానం కోసం పోటీ ప‌డుతున్న ప్ర‌తిప‌క్షాలు ఈ అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాయి.

బీజేపీ అలాంటి తెలివైన ఆలోచ‌నే చేసింది. అయితే బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన మాత్రం ఊగిస‌లాట‌లో ఉండ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. టీడీపీ మిన‌హా మిగిలిన రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ తాము బ‌రిలో ఉంటామ‌ని తేల్చి చెప్పాయి. జ‌న‌సేన మాత్రం ఇంకా అవున‌ని లేదా కాద‌ని కాని చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ బీ టీం జ‌న‌సేన అనే విమ‌ర్శ‌ల‌కు బ‌లం చేకూర్చేలా ఆ పార్టీ అడుగులు ఉంటున్నాయి.

మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ తాను పోటీలో ఉంటాన‌ని తేల్చి చెప్పినా …జ‌న‌సేన ఎందుకు త‌ట‌ప‌టాయిస్తున్న‌దో ఎవ‌రికీ అర్థం కాని ప‌రిస్థితి. టీడీపీ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం త‌ర్వాత ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అస‌లైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తుంద‌ని చెప్పారు. ఇత‌ర పార్టీల్లా అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా, లేన‌ప్పుడు మ‌రోలా బీజేపీ వ్య‌వ‌హ‌రించ‌ద‌ని ఆయ‌న టీడీపీని దెప్పి పొడిచారు.

ఎన్నిక‌ల బ‌రి నుంచి ఎప్పుడూ బీజేపీ త‌ప్పుకోదని ఆయ‌న అన్నారు. ప్ర‌జాక్షేత్రంలో వైసీపీ దౌర్జ‌న్యాల‌ను ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఎదుర్కొంటామ‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీని ఎదుర్కొనే స‌త్తా బీజేపీకే ఉంద‌నే విష‌యం మ‌రోసారి రుజువైంద‌ని సోము వీర్రాజు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇది రాజ‌కీయం అంటే.

క్షేత్ర‌స్థాయిలో ఒక శాతం లోపు ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తామ‌ని చెబుతుంటే, ఐదారు శాతం ఓట్లు ఉన్న జ‌న‌సేన మాత్రం తాత్సారం చేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. టీడీపీ మాదిరిగానే జ‌న‌సేన కూడా బ‌హిష్క‌ర‌ణ బాట ప‌డుతుందా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఇదే జ‌రిగితే మాత్రం టీడీపీతో పాటు జ‌న‌సేన కూడా రాజ‌కీయంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టే!