వృక్షో రక్షతి రక్షితః అని మన పెద్దలు చెప్పారు. దీని అర్థం చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందని అర్ధం. ఇది ఒక చెట్టుకు మాత్రమే పరిమితం చేసి చూడకూడదు. ఇందులో అర్థం చేసుకునే వాళ్లకు చేసుకునేంత నిగూఢమైన అర్థం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఈ సూత్రం ప్రజాస్వామ్యానికి బాగా వర్తిస్తుంది. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చిసిందన్న చందంగా, టీడీపీ ఒకే ఒక్క బహిష్కరణ నిర్ణయం మాత్రం ఆ పార్టీలో కల్లోలం రేపుతోంది.
ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడితే, ఆ ప్రజాస్వామ్యమే మనల్ని కాపాడుతుందని అర్థం చేసుకోవాలి. తాజాగా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం …ఆ పార్టీ అంతానికి బీజం వేసిందనే కఠిన వాస్తవాన్ని చెప్పక తప్పదు. 40 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో అతిపెద్ద, సరిదిద్దుకోలేని చారిత్రక తప్పదాన్ని చంద్రబాబునాయుడు చేశారనే అభిప్రాయాలు సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఎన్నికల బహిష్కరణ అనేది ఏ రకంగానూ సరైన ఎత్తుగడ కాదు.
ప్రధాన పరిషత్ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ చెబుతున్న కారణాలను పరిశీలిస్తే … చాలా పేలవంగా ఉన్నాయని అర్థం చేసు కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘ ఏకపక్ష నిర్ణయం, ప్రభుత్వ అప్రజాస్వామిక, అరాచక విధానాలకు నిరసనగా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
ఇలాంటి పరిస్థితుల్లోనే కదా, ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కర్తవ్యం తమపై ఉందని చంద్రబాబు ఎందుకు గ్రహించలేకపోయారనే ప్రశ్నలు టీడీపీ వైపు నుంచే రావడం విశేషం.
అన్నీ బాగుంటే ప్రజలకు టీడీపీ అవసరం ఏంటి? అరాచకాలు, అప్రజాస్వామిక రాజ్యమేలుతున్నాయని నమ్ముతున్న పార్టీగా, వాటికి వ్యతిరేకంగా ప్రజాకోర్టులో తలపడి, బుద్ధి చెప్పాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరించినట్టు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన కర్తవ్యాన్ని ఎందుకు గాలికి వదిలేసినట్టు? ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవని టీడీపీని, భవిష్యత్‌లో మాత్రం ఎందుకు ఆదరించాలి? ఎందుకు ఆదరిస్తారు?
ఇలాంటి ప్రశ్నలు టీడీపీ అంతరాత్మ వేసుకుని ఉంటే… బహిష్కరణ లాంటి చారిత్రక తప్పిదానికి పాల్పడేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా బహిష్కరణ లాంటి ఒకే ఒక్క తప్పిదంతో టీడీపీ తన గోతిని తానే తవ్వుకున్నట్టైంది. టీడీపీ పతనమవుతుందనేందుకు ఎలాంటి అనుమానాలు లేవనే వాదన తెరపైకి వచ్చింది.