సోషల్ మీడియాలో చూసేవన్నీ నమ్మనక్కర్లేదు, అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని మరేదో అంటూ ప్రచారం చేస్తూ ఉంటారని కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఇటీవలే ఒక పోస్టు వైరల్ గా మారింది. అదేమిటంటే.. ఒక కొండ ప్రాంతంలో ఒక ట్రాక్టర్ అతి కష్టం మీద వెళ్తుంటుంది. దాని ట్రాలీలో కొంత సరంజామా ఉంటుంది. ఒక నిమిషంలోపు వ్యవధితో ఉండే ఆ వీడియో కింద ఏమని రాశారంటే..ఇండో-చైనా బోర్డర్ లో భారత సైనికులు రోడ్డు వేస్తున్నారని, వాళ్లెంత కష్టపడుతున్నారో చూడాలంటూ జైహింద్ అంటూ ఆ పోస్టును కొంతమంది వైరల్ చేశారు.
కామెడీ ఏమిటంటే.. ఆ తర్వాత అదే వీడియోను వాడుకుంటూ, ఎక్కడో ఉత్తర భారతదేశంలో పర్వత ప్రాంతంలో ఉండే హిందూ దేవాలయానికి పైన జనరేటర్ బిగిస్తున్నారని అంటూ మరో పోస్టు వైరల్ గా మారింది! ఇందులో ఏది నిజం? అంటే..బహుశా రెండూ ఫాల్సే అయి ఉండొచ్చు! ఇలా ఉంటుంది సోషల్ మీడియా తీరు. నిర్థారించే వాళ్లు ఉండరు!
ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లె లో ఇద్దరమ్మాయిలు నాగలి తరహా పనిముట్టును లాగుతూ ఉండటం, వెనుక వారి తల్లి విత్తనం సాగిస్తూ ఉండటం, ఆ ఫొటో వైరల్ గా మారడం, ఆ విషయంపై సోనూసూద్ స్పందించడం, సాయంత్రానికే వారికి ట్రాక్టర్ తీసీయడం, ఈ విషయంపై శ్రీమాన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందిచేయడం, ఈ పరిణామాలన్నీ వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి.
వాస్తవానికి చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో నిజంగానే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఆయన సిగ్గుపడాలి. అంతర్జాతీయ నేత అంటూ ప్రచారం పొందుతూ సొంత ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉండటానికి 14 యేళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు బాధ్యత ఏమాత్రం ఉండదా?
ఆ సంగతంతా అలా ఉంటే..పై ఫొటో వైరల్ గా మారిన నేపథ్యంలో.. ఆ వెంటనే స్థానిక ఎంపీడీవో అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరణను ప్రముఖ దినపత్రిక 'ది హిందూ' ప్రచురించింది.
వాస్తవానికి ఎద్దులాగినట్టుగా మనిషి నాగలి లాగడం అనేది ఏ మాత్రం సాధ్యం అయ్యే పని కాదు. వ్యవసాయం మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా ఆ విషయం తెలుస్తుంది. ఏవో కొన్ని సినిమాల్లో అలాంటి విపరీత సీన్లు చూపిస్తూ ఉంటారు.
సెంటిమెంట్ ను పండించడానికి అలాంటి సీన్లు తీసి జనాలను వెర్రివాళ్లను చేస్తారు సినిమా వాళ్లు. నిజ జీవితంలో కూడా మనుషులను నాగలి కాడికి కట్టి లాగడం సాధ్యం కాదు. లాగినా నాగలి నేలలోకి దిగేంత ఒత్తి పట్టుకోవడమూ సాధ్యం కాదు. అలా ఎవరైనా చేశారంటే.. అది సేద్యమూ కాదు!
సరిగ్గా అదే జరిగిందట ఈ ఫొటోలో కూడా. ఈ విషయాన్ని ఎంపీడీవో చెప్పినట్టుగా హిందూ పత్రిక రాసింది. వారి విషయం వైరల్ అయ్యాకా ఎంపీడీవో ఆ ఊరికి వెళ్లాడు. కథాకమామీషు కనుక్కొన్నాడట.
ఆ అమ్మాయిలు సరదాగా ఆ పని చేశారని, నిజానికి అక్కడ ఎద్దులు లేదా ట్రాక్టర్ దొరకని పరిస్థితి కానీ, వాటికి డబ్బులిచ్చి పని చేయించుకోలేని ధీన స్థితిలో కానీ వారు లేరట. ఆ అమ్మాయిలు ఆ ఊర్లోనే ఉండరట. లాక్ డౌన్ కాబట్టి ఆ ఊరికి వచ్చారని తెలుస్తోంది. వచ్చిన వాళ్లు సేద్యం పనికి వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకోవడానికి, వీడియోల కోసం అలా కాడిని లాగారు.
దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసరికి అది వైరల్ అయ్యింది. వైరల్ అయ్యాకా.. వాటికి ఎవరికితోచిన భాష్యాలు వారు అంటించారు. సోనూసూద్ అలా స్పందించేశాడు. దీన్ని చూసి చంద్రబాబు తన రాజకీయం మొదలుపెట్టారు.
ఆ పల్లెకు వెళ్లి వచ్చిన ఎంపీడీవో మాత్రం.. వాళ్లు అదంతా కావాలని-సరదాగా చేసుకున్నారని, అంత దయనీయమైన పరిస్థితుల్లో వారు లేరని తేల్చి చెప్పారు. విశేషం ఏమిటంటే.. సోనూసూద్ పంపిన ఆ ట్రాక్టర్ ను పంచాయతీకి అప్పగించాలని ఆ కుటుంబం కూడా భావిస్తోందట. అసలు కథ ఇదని సమాచారం!