వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇదో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. ఇప్పటికే బీజేపీ వదిలిన బాణం షర్మిల అని టీఆర్ఎస్, కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిలకు మోదీ ఫోన్ చేయడం… ప్రత్యర్థుల ప్రచారానికి బలం ఇచ్చినట్టైంది.
తెలంగాణలో టీఆర్ఎస్‌తో షర్మిల ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. ఇటీవల ఆమె పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఆమె వాహనాలను ధ్వంసం చేశారు. అలాగే పాదయాత్ర ఫ్లెక్సీలను తగులబెట్టారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఆమె స్వయంగా ధ్వంసమైన కారును నడుపుకుంటూ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు.
దీంతో ఆమెపై పోలీసులు కేసు బనాయించారు. జైల్లో పెట్టాలని అధికార పార్టీ పట్టుదలకు పోయింది. అయితే కోర్టు బెయిల్ ఇవ్వడంతో షర్మిల ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఆమె గవర్నర్‌ను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా, వరంగల్ పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు.
పాదయాత్ర చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుందని కారణంతో పోలీసులు నోటీసు ఇచ్చారు. చివరికి ఆమె పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో షర్మిల పోరాటాన్ని బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆమె పాదయాత్రపై దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్ తమిళిసై ఇప్పటికే ఖండించారు.
తాజాగా షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి 10 నిమిషాల పాటు మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలపై షర్మిలను మోదీ అడిగి తెలుసుకున్నారని సమాచారం. షర్మిలకు అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. మోదీ ఫోన్ కాల్‌కు సంబంధించి షర్మిల చెబితేనే… పూర్తి వివరాలు తెలుస్తాయి.