ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు అంత తేలిగ్గా వదిలి పెడ్తారా? అంటే….విడిచి పెట్టరనే సమాధానం వస్తోంది. ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రత్యర్థులపై కక్ష కడితే ఏ విధంగా వ్యవహరిస్తారో ఎన్నైనా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తమకు అనుకూలంగా లేని నాయకుల అంతు చూసే వరకూ వాళ్లిద్దరూ నిద్రపోరని అంటారు.
మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పోరాటంలో భాగంగా చాలా దూరం వెళ్లారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నారంటే… అందుకు కారణం బీజేపీతో తాడోపేడో తేల్చుకోడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమార్తె కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎక్కడో లింక్ ఉన్నట్టు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టుగా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. లిక్కర్ స్కామ్‌లో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మీ ఇంటికైనా వచ్చి విచారిస్తామని సీబీఐ అడగడంతో మొదట కవిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. తన పేరు ఎఫ్ఆర్ఐలో లేదని, కావున తాను విచారణకు రాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో తరువాత ఏం జరుగుతుందోననే చర్చకు తెరలేచింది.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తన గుప్పిట విచారణ సంస్థలను పెట్టుకుంది. బీజేపీ ఏం చెబితే అది చేయడానికి ఆ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత విచారణకు రానంటూ, సరే అని సీబీఐ అధికారులు తలూపే పరిస్థితి వుండదు. కవితను లిక్కర్ స్కామ్‌లో ఇరికించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సీబీఐ అన్వేషిస్తుంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా విచారణకు అసలే రానని కవిత చెప్పలేదని, ప్రత్యామ్నాయ తేదీలను సూచిస్తూ ఆమె సీబీఐ అధికారులకు లేఖ రాసిందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు తమ నాయకురాలు ఎందుకు భయపడుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితను విచారించడంపై సీబీఐ అధికారులు ప్రకటన చేస్తే తప్ప అసలేం జరుగుతున్నదో తెలిసే అవకాశం లేదు.