రాజకీయ నాయకులు ఒక్కోసారి చెప్పాలనుకున్నది నేరుగానే చెబుతారు. ఒక్కోసారి నర్మగర్భంగా అంటే ఇండైరెక్టుగా చెబుతారు. ఆ మాటలను మనం డీకోడ్ చేసుకోవాలి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలావరకు నేరుగానే మాట్లాడతారు. కానీ ఒక్కోసారి నేరుగా చెప్పరు. మనం అర్ధం చేసుకోవాలి.
నిన్న ఆయన అసెంబ్లీలో దళితబంధు గురించి మాట్లాడుతూ మళ్ళీ అధికారంలోకి వస్తామన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని అర్ధం. ఓకే… ఇది క్లియర్ గా ఉంది. ఆ తరువాత ఆయన ఇంకా మాట్లాడుతూ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్ కు రావొచ్చు. కేంద్రంలో టీఆర్ఎస్ కు పాత్ర దొరికే అవకాశం రావొచ్చు అన్నారు. కేంద్రాన్ని శాసించే అవకాశం రావొచ్చు అంటే తాము చెప్పినట్లు కేంద్రం వినే పరిస్థితి రావొచ్చని అర్ధం.
దీన్ని గురించి కాస్త వివరంగా చెప్పుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో చెప్పలేం. ఎన్డీయే గెలిచినా, యూపీఏ గెలిచినా పూర్తి మెజారిటీ రాకపోవచ్చు. అంటే అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోతాయన్న మాట. అధికారం దక్కించుకునే మేజిక్ ఫిగర్ అంటారే అది సాధించలేకపోవచ్చు. అప్పుడు టీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమవుతుంది.
వీళ్ళ ఎంపీల అవసరం పడుతుంది. ఆ సమయంలో ఫలానా డిమాండ్లు తీరుస్తామని హామీ ఇస్తేనే మద్దతు ఇస్తామని బేరం ఆడొచ్చు. కేంద్రాన్ని శాసించే అవకాశం అంటే ఇదే కావొచ్చు. కేంద్రంలో పాత్ర దొరికే అవకాశం రావొచ్చు అని కేసీఆర్ ఇంకో మాట అన్నారు. అంటే కేంద్రంలో అధికారంలో పాలు పంచుకుంటామనే అర్ధం కావొచ్చు.
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని కేసీఆర్ అన్నారు కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేం. కేసీఆర్ మాటలను బట్టి అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఆయన ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతోందో ఆలోచిస్తున్నారన్న మాట.