మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. ఇది కేవలం ఓ సంస్థకు అధ్యక్షుడ్ని ఎన్నుకొనే ప్రక్రియ కాదు. దీని వెనక చాలా పెద్ద కథే దాగుంది. ఇంకా చెప్పాలంటే అసోసియేషన్ బిల్డింగ్ అనే అంశంతో పాటు.. మేనిఫెస్టోలో చెబుతున్న అంశాలేవీ కారణం కాదు. కేవలం ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటమే ఈ ''మా'' ఎన్నికలు. సంక్షేమం కోసమే ఈ సమరం అనేది పైపైన పూత మాత్రమే.
అసోసియేషన్ బంగారు బాతు కాదు. ఇందులో పదవి చేపడితే డబ్బులు సంపాదించుకోవచ్చనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే. ఇందులో నొక్కేసే డబ్బు కంటే, ఓ సినిమా చేస్తే వచ్చే పారితోషికం ఎక్కువగా ఉంటుంది. అసలు ''మా''లో తినడానికేముంది, ఆల్రెడీ అంతా తినేశారని వాదించే బ్యాచ్ కూడా ఉంది.
ఈ సంగతులు పక్కనపెడితే.. ఈసారి ''మా'' ఎన్నికలు మాత్రం పూర్తిగా ఓ అంశం ప్రాతిపదికన నడుస్తున్నాయని చెప్పక తప్పదు. అదే “టాలీవుడ్ పెద్ద దిక్కు” అనే పదవి. పైకి కనిపించని ఈ పదవి కోసం ఒకరు ఆరాట పడుతుంటే.. ఆ ఇమేజ్ దక్కకుండా చేసేందుకు మరో వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగే పోటీనే ఈ ''మా'' ఎలక్షన్.
చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవుతారా..?
దాసరి తర్వాత టాలీవుడ్ లో పెద్ద దిక్కు ఎవ్వరూ లేరనే మాట వాస్తవం. దీన్ని అంతా అంగీకరిస్తారు కూడా. సరిగ్గా ఈ గ్యాప్ ను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు చిరంజీవి. ''టాలీవుడ్ పెద్ద దిక్కు'' అనే ఇమేజ్ ను సంపాదించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనేది కూడా బహిరంగ రహస్యం.
అందరివాడు అనిపించుకోవడం కోసం ఆయన ఇప్పటికే అనేక పనులు చేశారు. ఇంకా చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అసోసియేషన్ ఎన్నికలు వచ్చాయి. తన కాంపౌండ్ నుంచి ప్రకాష్ రాజ్ ను అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దించారు చిరంజీవి. టాలీవుడ్ పెద్ద దిక్కుగా ఎదిగే క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత, అవసరం ఇప్పుడు చిరంజీవిపై పడింది.
ప్రకాష్ రాజ్ ను గెలిపించుకోకపోతే.. ఇండస్ట్రీపై చిరంజీవికి పట్టు లేదంటారు. అలాంటప్పుడు పెద్ద దిక్కుగా ఎలా అవతరిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. అందుకే మెగా కాంపౌండ్ కు, ప్రత్యేకించి చిరంజీవికి ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా మారింది.
చిరంజీవికి ఎన్నో స్పీడ్ బ్రేకర్లు
టాలీవుడ్ పెద్ద మనిషిగా మారేందుకు ఓవైపు చిరంజీవి ప్రయత్నిస్తుంటే.. దాన్ని అడ్డుకునేందుకు చాలామంది ట్రై చేస్తున్నారు. చిరంజీవి పెద్దరికాన్ని ఒప్పుకోమని ఇప్పటికే మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి నటులు పరోక్షంగా తమ మనసులో మాట బయటకు కక్కేశారు. “ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవ్వరూ లేరు. భవిష్యత్తులో దాసరి స్థానం భర్తీ కాదు” అనేది వీళ్లిద్దరి ఉమ్మడి మాట.
వీళ్లతో పాటు పైకి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని మరికొంతమంది నటులు కూడా చిరంజీవి పెద్దరికాన్ని అడ్డుకునేందుకు తెరవెనక శాయశక్తులా కృషి చేస్తున్నారు. అంతెందుకు.. గతంలో చిరంజీవి అధ్యక్షతన కొంతమంది తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా ఇదే.
ఇలాంటి టైమ్ లో అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు విజయం వరిస్తే, అది పరోక్షంగా చిరంజీవి విజయం అవుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెజారిటీ సభ్యులు చిరంజీవి వైపు ఉన్నట్టు అవుతుంది. అప్పుడు చిరంజీవి పెద్దరికానికి అదే పునాది అవుతుంది. కొంతమంది సీనియర్ నటులకు అలా జరగడం ఇష్టం లేదు. అందుకే మంచు విష్ణు లాంటి నటుడు ఏకంగా అధ్యక్ష బరిలో నిలిచాడు.
మోహన్ బాబు మాటలతో స్పష్టత
నిజానికి ''మా'' కు యాక్టివ్ హీరోలెవ్వరూ అధ్యక్షులుగా లేరు. అంత ఆసక్తి కూడా చూపరు. ఈసారి విష్ణు లాంటి హీరో రంగంలోకి దిగడానికి ప్రధాన కారణం ఇదే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ''మా'' కు బిల్డింగ్ కట్టి దానికి చిరంజీవి పేరో, అల్లు రామలింగయ్య పేరో పెట్టేస్తారని.. దాన్ని అడ్డుకునేందుకే మోహన్ బాబు, బాలయ్య లాంటి వ్యక్తులు మంచు విష్ణును రంగంలోకి దించారనేది కేవలం ఓ అంశం మాత్రమే. అసలు సంగతి ''పెద్దరికం'' చుట్టూ తిరుగుతుంది. ఈసారి ''మా'' ఎన్నికలు కులం కంపు కొట్టడానికి, రెండు వర్గాలుగా విడిపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం.
ఇండస్ట్రీలో ఓ సమస్య వస్తే నిర్మాతల మండలికో, ''మా'' అసోసియేషన్ కో వెళ్లరు. ఓ పెద్ద మనిషి దగ్గరకు వెళ్తారు. ఒకప్పుడు దాసరి ఆ పాత్ర పోషించేవారు. చాలా సందర్భాల్లో దాసరి మాట శాసనం. తమ్మారెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర చిన్న స్థాయి సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ అంతకుమించి పెద్ద సమస్యలు పరిష్కారం చేసే వ్యక్తి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని ఈమధ్య స్వయంగా మోహన్ బాబు వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఓ పెద్ద దిక్కు లేని మాట వాస్తవం అన్నారాయన.
ఈ విషయంలో కొందరు మెగా కాంపౌండ్ ను ఆశ్రయిస్తే, మరికొందరు నిర్మాతల మండలికి మొరపెట్టుకుంటున్నారు. చివరికి చాలా సమస్యలు పరిష్కారం అవ్వక, వివాదాలు కూడా రేపుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పడింది కూడా టాలీవుడ్ లో ఉన్న ఈ శూన్యత వల్లనే. సో.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి ఆమోదంతో టాలీవుడ్ కు ఓ పెద్దదిక్కు ఉండాల్సిందే. ''మా'' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలిస్తే.. ఈ సందిగ్దతకు దాదాపుగా ఓ సమాధానం దొరికినట్టే.