పాఠం ఎత్తేయాలా..? మార్పులు చేస్తే పోలా..?

అసలే అమరావతికి అన్యాయం జరిగిందంటూ అక్కడ కొంతమంది ఆందోళన చేస్తున్నారు. పోనీ ఆ ఉద్యమం వెనక ఎవరో ఉన్నారనే అనుకుందాం.. అది ఫేక్ అనుకుందాం.. కానీ ఓ సెక్షన్ మీడియా అమరావతి సమస్యని మొత్తం…

అసలే అమరావతికి అన్యాయం జరిగిందంటూ అక్కడ కొంతమంది ఆందోళన చేస్తున్నారు. పోనీ ఆ ఉద్యమం వెనక ఎవరో ఉన్నారనే అనుకుందాం.. అది ఫేక్ అనుకుందాం.. కానీ ఓ సెక్షన్ మీడియా అమరావతి సమస్యని మొత్తం ఆంధ్రప్రదేశ్ సమస్యగా చిత్రీకరిస్తోంది. ఈ దశలో అమరావతి విషయంలో ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

అయితే ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు జగన్ ని పరోక్షంగా అమరావతి పట్ల విలన్ గా చిత్రీకరించేందుకు దోహదపడుతున్నాయి. అమరావతి దగ్గర ఆందోళనలను పోలీసులు అడ్డుకునే విషయం దగ్గర్నుంచి.. తాజాగా అమరావతి పాఠ్యాంశాన్ని పదో తరగతి సిలబస్ నుంచి తీసేసే వరకు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. 

జగన్ మూడు రాజధానులకు మద్దతు తెలిపారు కానీ, అమరావతిని ద్వేషించమని చెప్పలేదు. కానీ అధికారులు మాత్రం అమరావతిపై వ్యతిరేకత పెంచుకున్నారని అనిపిస్తోంది. సీఎం మెప్పు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థమవుతోంది.

పదో తరగతి తెలుగు పుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారని ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఈ పాఠం తొలగించి, కొత్త పుస్తకాలు ముద్రించారనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వంలోని పెద్దలెవరూ పదో తరగతి పుస్తకంలో సదరు పాఠాన్ని తొలగించాలని చెప్పి ఉండరు. కానీ అధికారుల స్థాయిలోనే ఈ అసంబద్ధ నిర్ణయం జరిగిపోయింది, చివరకు ఆ మరక ప్రభుత్వానికి అంటుకుంటోంది.

అసలింతకీ అమరావతి పాఠంలో ఏముంది..?

అమరావతి పూర్వ వైభవం దగ్గర్నుంచి.. ఏపీ రాజధానిగా అమరావతి శంకుస్థాపన వరకు అంతా ఈ పాఠంలో ఉంది. అయితే చివరి రెండు పేరాలు మాత్రం మోదీ, చంద్రబాబుని మోసేసేలా ఉన్నాయి. వెనిస్ నగరంలా అమరావతిని తీర్చిదిద్దుతున్నారని, ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, రహదారులు.. ఇలా చాలా స్వోత్కర్ష అందులో ఉంది. 

అభ్యంతరకరం అనుకుంటే అంతవరకు దాన్ని తొలగిస్తే బాగుంటుంది. అంతే కానీ.. మొత్తం అమరావతి పాఠాన్నే ఎత్తేస్తే ఎలా? అమరావతికి ఓ చరిత్ర ఉంది. అది పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది.

అమరావతి అంటే జగన్ కి ద్వేషం ఉంటే.. మూడు రాజధానుల్లో దానికి స్థానం ఉండేది కాదు కదా. శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నారంటే అక్కడ విపరీతార్థాలు ఎందుకు..? అసలు అమరావతిని పుస్తకంలో నుంచి పూర్తిగా ఎత్తివేయడం ఎందుకు..? చివరి రెండు పేరాలు తీసేస్తే హుందాగా ఉండేది కదా. తాజా ఘటనతో ప్రతిపక్షానికి మరో అస్త్రం అందించినట్టయింది.