2004 సమయంలో రైతుల ఆత్మహత్యల గురించి ఒక బీజేపీ నేత, నాటి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రైతులు ఒళ్లు కొవ్వెక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అంటూ ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తూ ఉన్నా.. ఆ కామెంట్ ఇప్పటికీ చెరిగిపోదు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చీటీ మాత్రం చిరిగిపోయింది.
రైతు ఆత్మహత్యల గురించి సమాధానం ఇవ్వమంటే.. వాళ్లకు కొవ్వు పట్టి ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే మాట ద్వారా అధికారం అనే అహం తమలో ఏ స్థాయిలో అవహించిందో కమలం పార్టీ నేతలు అప్పుడు క్లియర్ గా చాటుకున్నారు. ఆ తర్వాత ప్రజలు చేయాల్సింది చేశారు.
ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురులేని పరిస్థితి. ఈ సారి కూడా బీజేపీకి తగవు రైతులతోనే వచ్చింది. మోడీ ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాల విషయంలో రచ్చ కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో కాస్తైనా ఆచితూచి స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం, తెగేదాకా లాగేదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది.
ఏదైనా కార్పొరేట్ చట్టం విషయంలో కార్పొరేట్లు అభ్యంతరాలు చెప్పి ఉంటే.. కేంద్రం ఇలాగే వ్యవహరించగలిగేదా? అర్ధరాత్రి స్వతంత్రం అనే లెవల్లో తెచ్చిన జీఎస్టీ విషయంలో ఇప్పటి వరకూ 40 సార్లకు పైగా సమీక్షలు నిర్వహించారు! ఇదీ తాము తెచ్చిన చట్టాల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించే తీరు. అయితే సాగు చట్టాల విషయంలో మాత్రం తగ్గేది లేదంటూ ఉన్నారు.
ఆ వ్యవహారంలో రైతుల నిరసనకు అన్ని వ్యవస్థలూ కలిసి దారులు మూసేస్తూ ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. యూపీలో రైతులపై జరిగిన దాష్టీకం మాత్రం చరిత్రలో ఇది వరకూ లేనిది. కేంద్ర మంత్రి తనయుడే నిరసన తెలుపుతున్న రైతులపైకి వాహనాన్ని ఎక్కించాడని ఎఫ్ఐఆర్ నమోదైంది.
రైతులపైకి నిర్దయగా కారును ఎక్కించడమే అత్యంత దారుణమైన చర్య. దానికి బాధ్యుడు స్వయంగా కేంద్ర మంత్రి తనయుడు అని రైతులు చెబుతున్నారు. ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. వారు సమర్పించిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరి ఆ తర్వాత ఈ పేరును ఉంచుతారా.. తొలగిస్తారా.. అనేది చూడాల్సిన అంశం.
బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో ఈ దారుణం చోటు చేసుకుంది. కేంద్రమంత్రులిద్దరు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శాంతీయుతంగా ఆందోళన తెలుపుతున్న రైతులపై జరిగిన దాష్టీకం ఇది. ఆ ఇద్దరి కేందమంత్రుల్లో ఒకరి తనయుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది వరకూ ప్రభుత్వాలు ఆందోళనలు తెలుపుతున్న రైతులపై పోలీసులతో దాడులు చేయించిన వైనాలు చరిత్రకు ఎక్కాయి. అవే చెరిపితే చెరిగిపోయేవి కావు.
ఇప్పుడు స్వయంగా బీజేపీ వాళ్లే.. ఇలాంటి దాడులకు దిగితే.. అది ఆ పార్టీ రాసుకుంటున్న స్వీయ పతనమే. ఈ మధ్యనే ఆందోళనలు తెలుపుతున్న రైతులపై దాడులు చేయాలని, బీజేపీ కార్యకర్తలు ఆ పనికి పూనుకోవాలని ఒక రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రే పిలుపునిచ్చాడు. రైతులను చితక్కొట్టాలని.. కేసులు వస్తే.. బెయిల్ ఇచ్చేస్తామని,ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా రైతులపైకి దాడులు చేయాలని ఒక సీఎంగారు బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు కేందమంత్రి తనయుడు అదే పిలుపును ఫాలో అయి ఉండవచ్చునేమో!