విడాకులు, విడిపోతున్నారు.. అనే ఊహాగానాల ఊసు లేదు. ఆ స్టార్ హీరో కూతురు అలా అంట, ఆ హీరో కూతురు ఇలా అంట.. అనే ఝంజాటాలు లేవు! సినిమాలూ, కెరీర్, కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్లు.. ఇక పిల్లాపాపలతో గడపాలంటే.. తమ్ముళ్ల పిల్లలు, మేనళ్లుల్లు, మేనకోడళ్లు ఉండనే ఉన్నారు! ఏతావాతా.. బాలీవుడ్ అయితేనేం, టాలీవుడ్ లో అయితేనేంత.. స్టార్ హీరోలను వార్తల్లోకి తెచ్చే భవబంధాలకు నిమిత్తం లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు సల్మాన్ ఖాన్!
మాజీ గర్ల్ ఫ్రెండ్స్ బోలెడంత మంది సల్మాన్ కు. అంతా స్టార్ హీరోయిన్లు, అందానికి నిర్వచనం లాంటి అతివలే. వారితో సల్మాన్ బంధం ఎంత వరకూ అనేది పక్కన పెడితే, స్త్రీ సాంగత్యానికి అయితే లోటు లేకపోవచ్చు! ఈ మధ్య కూడా సల్మాన్ ఖాన్ కత్రినాకైఫ్ తో విదేశాల్లో విహరించి వచ్చాడంటారు, అది సినిమా షూటింగ్ కోసం అనుకోండి!
అలాగే సల్మాన్ ను మాజీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా పెద్దగా నిందించరు. ఐశ్వర్యరాయ్ తో మాత్రమే వివాదం తీవ్రం అయ్యింది. కొన్నాళ్లు అమెతో గొడవపడిన సల్మాన్, ఆ తర్వాత ఆ గొడవ కథ ఎత్తనే లేదు. సల్లూ, ఐష్ ఒకరినొకరు అవాయిడ్ చేసుకుని కాలం గడుపుతున్నారు. సల్మాన్ సోదరులు ఎక్కడైనా కనిపిస్తే.. హాయ్ చెబుతుంది ఐశ్వర్యరాయ్. ఇక ఐశ్వర్యరాయ్ అమితాబ్ ఇంటి కోడలయ్యాకా.. అమితాబ్, అభిషేక్ లకు కూడా సల్మాన్ దూరదూరంగా కనిపిస్తాడు. లేనిపోని వివాదాలకు దూరంగా ఉండటానికి ఇదో బెస్ట్ పాలసీ.
ఆమిర్ ఖాన్ లా .. వివాహాలు, విడాకులు, రచ్చలు లేవు. షారూక్ కు అలాంటి ఇబ్బంది లేకపోయినా.. పిల్లల విషయంలో ఇప్పుడు షారూక్ కు తలబొప్పి కడుతున్నట్టుగా ఉంది. అన్ని ఆస్తిపాస్తులున్నాకా.. అంత గ్లామరస్ లైఫ్ ఉన్నాకా.. పిల్లలను నియంత్రించడం అంటే ఏ స్టార్ హీరోకి అయినా మాటలేమీ కాదు. స్టార్ అనే మాటను పక్కన పెడితే, ఆ స్థితిలో పిల్లలను కంట్రోల్ చేయడం కాదు, కదా.. కంట్రోల్ చేయాలనుకునే ఆలోచన కూడా.. ఏ తండ్రికీ అంత తేలికైనది కాదు.
అవతల చూస్తే.. లోకం పొడుస్తుంది. పొడుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా విస్తృతం అయ్యాకా.. సెలబ్రిటీలకు మరింత సంపాదన అయితే పెరిగిందేమో కానీ, వారి బతకులు మరింతగా రచ్చకు ఈడ్చబడ్డాయనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి సందర్భంలో అయినా, వారి ఆనందాన్ని హరించి వేయడానికి సోషల్ మీడియా కామెంట్లు ఒక్కటీ చాలు.
ఈ పరిస్థితులు అన్నీ గమనిస్తే.. చేజేతులారా చేసిన తప్పిదాలను పక్కన పెడితే, సల్మాన్ ఖాన్ మిగిలిన స్టార్లందరి కన్నా ప్రశాంతంగా ఉన్నాడు. భార్య, పిల్లలు అనే భవబంధాలకు దూరదూరంగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి అవిలేని జీవితం నిస్తేజమే, అయితే.. వ్యక్తిగతంగా బాలీవుడ్ స్టార్లు ఉన్న పరిస్థితులూ, సామాజిక పరిస్థితులను గమనిస్తే.. సల్మాన్ దే ప్రశాంతమైన జీవితం అనిపించవచ్చు!