తమిళ నటుల సంఘం పేరు “నడిగర్ సంగం” (నటుల సంఘం). తెలుగు సినీ నటుల సంఘం పేరు “మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్”. ఇక్కడే అర్థమౌతోంది తెలుగు సంఘంలో తెలుగుతనం ఎంతుందో.
నేను ఎప్పటినుంచో సినిమాల్లో నటిస్తున్నా ఈ అసోషియేషన్ లో మాత్రం సభ్యత్వం తీసుకోలేదు. ఎందుకంటే అవసరం అనిపించలేదు.
అయితే “మా” ఎన్నికల హడావిడిని మాత్రం ప్రతిసారీ ఒక ప్రహసనంలా చూస్తూనే ఉంటాను.
ఎప్పుడూ లేనంతగా “మా” అధ్యక్ష పదవికి ఈసారి ఈ యుద్ధమేంటి? పరస్పర ఆరోపణలేంటి? ఏదో పెద్ద ఎమ్మెల్యే ఎన్నికల రేంజులో నిరంతరాయంగా మాధ్యమాల్లో ఊకదంపుడు ప్రచారాలేంటి?
పైగా ఒక వర్గం వారు పొరుగూళ్లో ఉన్న 56 మంది ఓటర్ల పేరున తామే స్వయంగా రూ 500 చొప్పున రూ 28,000 కట్టేసి పోస్టల్ బ్యాలెట్ కి అనుమతులు తెచ్చిపెట్టడమేంటి?
మరొక వర్గం నాయకుడు ఇదే విషయాన్ని బయటపెడుతూ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకోవడమేమిటి?
“నా నరనరాల్లోనూ నటనే ఉంది” అని విష్ణుబాబు ఒక ఇంటర్వ్యూలో చెబితే దానికి ప్రకాష్ రాజ్ మరొక ప్రెస్ మీట్ లో, “నటన ఉండాల్సిని నరాల్లో కాదు, ముఖంలో ఉండాలి” అన్నారు.
దానికి ఆ సభలో ఉన్న ప్యానల్ సభ్యులంతా చప్పట్లు కొట్టి ఈలలేసారు.
ఆ భయంకరమైన సెటైర్ విష్ణుబాబుకి అర్థమయినట్టు లేదు. తన మొహంలో అసలు నటనే పలకదని ఆ బహుభాషా జాతీయ అవార్డు నటుడి విమర్శ.
టీవీ9 రజనీకాంత్ ఇదే విషయాన్ని గిల్లుతూ అడిగినా విష్ణుబాబు, “నేను కేవలం ఇంటెన్సిటీ చెప్పడానికి అలా అన్నాను. దానిని లిటరల్ గా తీసుకుంటే ఎలా?” అని గట్టిగా నవ్వుతూ బదులిచ్చాడు తప్ప తనకి సెటైర్ అర్థమైనట్టు మాత్రం రియాక్ట్ కాలేదు.
ఈ స్థాయిలో దాడి చేస్తున్న ప్రకాష్ రాజ్ ఒక పక్క. ఎన్నికల తర్వాత అందరం మొహాలు చూసుకోవాల్సిన వాళ్లం, అందరూ నోళ్లు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అని హెచ్చరిస్తున్న విష్ణు ఒక పక్క.
కేవలం 900 మంది సభ్యుల్లో ఎంత శాతం మంది ఓట్లేస్తారో కూడా తెలియని ఈ చిన్ని ఎన్నికకి దేనికోసం ఈ నటుల పాకులాట?
దీనిని చాలా మంది కమ్మ, కాపు వ్యవహారం కింద చూస్తున్నారు. అది చాలావరకూ నిజమే. కానీ అదొక్కటే పాయింటైతే ఇంత రాద్ధాంతం అనవసరం. తిప్పి కొడితే 900 ఓట్లలో కమ్మవారెంతమందో, కాపులెంతమందో లెక్కేసి మిగతా వాళ్లు ఎటు మొగ్గుతారో అంచనా వేసేస్తే అసలీ పోటీయే ఉండదు. లెక్క తేలిపోతుంది కాబట్టి అడ్వాంటేజ్ ఉన్నవాడు నిలబడతాడు మిగతా అందరూ కలిసి అతన్ని ఏకగ్రీవం చేసేస్తారు.
ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది పెద్దది. ఈ కనీళ్లు, ఈ అరుపులు, ఈ విమర్శలు, ఈ ప్రతివిమర్శలు అన్నీ ఒకే దాని కోసం.
“మా” బిల్డింగ్..
“మా” బిల్డింగ్ కట్టడం, ఆ కట్టే క్రమంలో కుదిరినంత సర్దుకోవడం, కట్టాక అందులో ఉన్న ప్రాంగణాలకి నచ్చినవాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఇరు వర్గాల ఎజెండా.
విష్ణుబాబు సొంత డబ్బుతో బిల్డింగ్ కడతానని చెబుతున్నాడు. సినిమాలు తీసి నష్టపోయానని, ప్రస్తుతం తన దగ్గర డబ్బులేదు అని చెబుతూనే బిల్డింగ్ మాత్రం సొంతంగా కడతానంటున్నాడు. ఇక్కడే క్లారిటీ లేదు- కాంట్రడికషన్ ఉంది.
అయినా సొంత డబ్బుతో కట్టాల్సినంత సరదా, అంతేసి బాధ్యత దేనికి? మధ్యయుగాల్లో మహారాజులాగ అంతా తానే కడతా అని వాగ్దానాలు దేనికి? స్థలాలు చూసానన్నాడు. నచ్చిన స్థలాన్ని కొనాలి. కొన్నాక కట్టాలి. అంతేసి డబ్బు ఎలా పోగేస్తాడు?
అలా కడతానని చెబుతుంటే తక్కిన మెంబర్లైన సినీనటులంతా సిగ్గులేకుండా మౌనంగా ఎందుకున్నారు? “నువ్వు కడితే మేమందులో వచ్చి కూచోవాలా? మాకు మాత్రం భాగస్వామ్యం వద్దా? మేం నటులం కాదా? మాకు ఆత్మాభిమానం లేదా?” అని ప్రశ్నించాలి కదా.
సొంత అస్తులు తాకట్టు పెట్టి కట్టేంత తెలివతక్కువవాడు మాత్రం కాదు విష్ణు. చాలా తెలివైన వాడు. చదువుకున్నవాడు. విదేశాల్లో నెట్వర్క్ ఉన్నవాడు. కచ్చితంగా బయటినుంచి విరాళాలు తెచ్చే కట్టాలి. పోనీ ప్రభుత్వం స్థలం ఫ్రీగా ఇస్తుందా అంటే ప్రస్తుతం టీఆరెస్ ప్రభుత్వం సినీరంగమ్మీద అంత సానుకూలంగా ఏమీ లేదు. ఒకవేళ స్థలం వరకూ చవకగా ఇచ్చినా కట్టడానికైతే కోట్లు కావాల్సిందే కదా.
ఇక ప్రకాష్ రాజ్ వర్గానిదీ బిల్డింగ్ గొడవే. ఇతనైతే ఏకంగా ప్రివ్యూ థియేటరు, కన్వెన్షన్ హాల్, రొహార్సిల్ హాల్, రెస్టారెంట్, జిం అంటూ చాలా లిస్ట్ చెప్పాడు. సింపుల్ గా చెన్నైలో 2016 నుంచి కట్టబడుతున్న “నడిగర్ సంగం” బిల్డింగ్ మాదిరిగా ఊహిస్తున్నాడు. అలాంటిది కట్టి అవసరమైన వారికి అద్దెకిస్తూ ఉంటే ఆ వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు నడుపుకోవచ్చు కదా అనేది ప్రకాష్ రాజ్ వాదాన.
“ప్రకాష్ రాజ్ అస్సలు లెక్కలు తెలియకుండా మాట్లాడుతున్నారు. అంత ఖర్చు పెట్టి ఆ చిన్నపాటి అద్దెల మీద ఎప్పటికి ఖర్చుని బ్రేకీవెన్ చేస్తారు?” అని విష్ణుబాబు అడుగుతున్నాడు. ఇంతకీ విష్ణు కట్టాలనుకునేది ఏ రేంజ్ బిల్డింగో మరి.
ఏది ఏమైనా ఒక మూడంతస్తుల బిల్డింగ్ కట్టి తండ్రి పేరు, తండ్రి గారి గురువు పేరు, తండ్రి గారి “అన్నగారు” పేరు ఒక్కొక్క ఫ్లోరుకి పెట్టాలని విష్ణుబాబు కలేమో అని నా అనుమానం. ఈ పేర్లే ఎందుకని ఎవరన్నా ప్రశ్నిస్తే, “నా సొంత డబ్బుతో కట్టాను. నువ్వెవిడివి ప్రశ్నించడానికి” అనొచ్చు.
మరొక వర్గం అదే బిల్డింగ్ పెద్దదిగా కట్టి చిరంజీవి పేరు, అల్లు రామలింగయ్య పేరు పెట్టాలని ప్రకాష్ రాజ్ కి అప్పజెప్పిన బాధ్యతేమో అని డౌటు.
ఏదైనా ప్రాజెక్ట్ ఎత్తుకున్నప్పుడే డబ్బులు విరాళాల రూపంలో రావడం, చేతులు తడవడం జరుగుతుంటుంది. ఇక్కడ రెండు వర్గాలు దానికోసమే పాకులాడుతున్నారని అనిపిస్తోంది.
ఎప్పటినుంచో “మా” బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన ఉన్నా ఈ సారి మాత్రం ఆ ప్రాజెక్టుని నెత్తికెత్తుకోవడానికి పోటీ ఏర్పడింది. ఒకవేళ నిజంగా బిల్డింగ్ ఎజెండా లేకపోతే శివాజీరాజా మాదిరిగా ఏ శివబాలాజీనో ఏకగ్రీవంగా ఎన్నుకుని కూర్చునేవారంతా. ఎందుకంటే బిల్డింగ్ కథ లేకపోతే డబ్బుకళ ఉండదు. అది లేనప్పుడు ఎవరికీ ఆసక్తి ఉండదు.
అయినా పర్లేదు. ఏవరో ఒకరు గెలవడం ఖాయం. ఎలాగో అలా బిల్డింగ్ కట్టడం జరగొచ్చు. కనీసం కట్టిన తర్వాతైనా ఆ భవనానికి ఒక తెలుగు పేరు పెడతారని ఆశిస్తున్నాను. లేకపోతే ఏమౌతుంది? “మా బిల్డింగ్” కి “మా టీవీ చానల్” బిల్డింగ్ కి తేడా ఉండదు.
ఒక తెలుగు సినీనటుడు