మూడు రాజధానులకు అనుకూలంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు పెరుగుతున్న కొద్దీ.. చంద్రబాబునాయుడులో సహజంగానే గుబులు పెరుగుతూ ఉంటుంది. వికేంద్రీకరణకు మద్దతుగా, కర్నూలులో హైకోర్టు విధిగా కావాలంటూ.. జరిగిన సభ కూడా ఆయనకు భయం పుట్టించి ఉంటుంది. పైగా ఈ సభా వేదిక మీదినుంచి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూటిగా చంద్రబాబుకు ఓ ప్రశ్న సంధించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని అన్నారు. చంద్రబాబు మాటల రూపంలో ఎటూ తప్పించుకోలేని ప్రశ్న అది.
దానిపై టీడీపీ శ్రేణులు రకరకాల నాటకాలు ఆడుతున్నాయి. మామూలుగానే ఏ రోటికాడ ఆ పాట పాడే అలవాటు ఉన్న చంద్రబాబునాయుడు.. ఏ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు.. వారికి రుచించే తియ్యటి మాటలు చెబుతుంటారే తప్ప నిర్దిష్టమైన విధానంతో ముందుకు పోవడం ఉండదు. బుగ్గన ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పే తెగువ చంద్రబాబుకు లేదు. అదే సమయంలో.. కొన్ని రోజుల కిందట కర్నూలులో పర్యటించినప్పుడు.. కర్నూలుకు హైకోర్టు రావాలని మొదట చెప్పిందే నేను అని చంద్రబాబు అన్నారు.
అలాంటి మెరమెచ్చు మాటలు కాదు.. తెలుగుదేశానికి ధైర్యముంటే..ఇప్పుడు బుగ్గన ప్రశ్నకు సూటిగా సమాధానం కావాలి. సీమగర్జన తర్వాత యావత్ రాయలసీమ తమ ప్రాంత బాగుకోసం ఏ పార్టీ ఏం అనుకుంటున్నదో ఏం చేయబోతున్నదో తెలుసుకోవాలని కోరుకుంటున్నది.
నేను ముందు చెప్పాను.. నా తర్వాత అందరూ చెప్పారు.. లాంటి మాటలు వద్దు.. ఇప్పుడు చంద్రబాబు స్పష్టంగా చెప్పాలి.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆయన ప్లస్ తెలుగుదేశం అనుకూలమా కాదా? తమ పార్టీ మేనిఫెస్టోలో హైకోర్టు అంశాన్ని పెడతారా లేదా? అధికారంలోకి వస్తే సత్వరం హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం అని చెబుతారా? లేదా? అనేది కావాలి.
ఎందుకంటే.. కర్నూలు సీమగర్జన తర్వాత.. భారతీయ జనతా పార్టీలో కూడా భయం పుట్టింది. సభలో పాల్గొనకపోయినప్పటికీ.. వారు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. ఆ నేపథ్యంలో చంద్రబాబునాయుడు కూడా తన వైఖరిని స్పష్టం చేయాలని పలువురు కోరుకుంటున్నారు. మరీ అంత సూటిగా అడిగితే చెప్పడం కష్టమబ్బా అని చంద్రబాబునాయుడు బుకాయిస్తారో.. లేదా తమ వైఖరిని తేలుస్తారో.. రెండు కళ్ల సిద్ధాంతంలాగా అటూ ఇటూ కాని మాటలు చెప్తారో చూడాలి.