ఒక ఊరి రాజు మరో ఊరి బంటు అని సామెత. తమిళ నాట సూపర్ స్టార్ అజిత్. అక్కడ క్రేజీ ప్రాజెక్ట్. మన దగ్గరకు వచ్చేసరికి బయ్యర్లను వెదుక్కోవలసి వచ్చింది. జస్ట్ ముచ్చటగా మూడు అంటే మూడు కోట్లకు తెలుగు థియేటర్ హక్కులు ఇచ్చేసారు. అజిత్ సంక్రాంతి సినిమా ‘తునివు’ దాని ముచ్చటే అది. సంక్రాంతికి అక్కడ థియేటర్ బరిలోకి అజిత్ సినిమా కాస్త ఆలస్యంగా దిగింది. ముందుగా హడావుడి చేస్తున్న విజయ్ వారసుడు సినిమాకు నిర్మాత తెలుగు వారైన దిల్ రాజు.
అందువల్ల వారసుడు ఇక్కడ మెగాస్టార్, బాలయ్య సినిమాలతో పోటీ పడే రేంజ్ కు వెళ్లిపోయింది. బాలయ్య, మెగాస్టార్ సినిమాలతో సమానంగా అనే కన్నా కాస్త ఎక్కువగానే వారసుడు సినిమాకు థియేటర్లు పడుతున్నాయి. కానీ ఈ తొడతొక్కిడిలో అజిత్ ‘తునివు’ సినిమాను పట్టించుకున్నవారే లేరు. అది ఎవరు తీసుకుంటారు..దానికి టైటిల్ ఏమిటి? ఇంకా..ఇంకా ఏదీ ఎవరికీ పట్టలేదు.
వున్నట్లుండి ఇప్పుడు అనౌన్స్ మెంట్ వచ్చింది. రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తునివు తెలుగు హక్కులు తీసుకుంది అంటూ. అప్పుడు తెలిసింది జస్ట్ మూడు కోట్లకు తెలుగు థియేటర్ రైట్స్ ఇచ్చేసారు అని. మూడు కోట్లు మాత్రమే అయినా ఏసి..డిసి ఆటే ఎందుకంటే మూడు ప్రాంతాల్లో కలిపి పట్టుమని వంద థియేటర్లు దొరకడం కష్టం అయిపోతుంది.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఏ సినిమా బ్లాస్ట్ అవుతుందో ఇప్పుడు తెలియదు. అలా అజిత్ సినిమా కనుక బాగుంది అని చిన్న టాక్ తెచ్చుకుంటే చాలు..బయ్యర్ల పంట పండినట్లే.