ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమకు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించేవాళ్లను చాలామందిని చూస్తుంటాం. అయితే అది వాళ్లిష్టం. కానీ ఇందులో కూడా సమయం-సందర్భం చూసుకోవాలి. అలా ముందు వెనక ఆలోచించని ఇద్దరు మహిళా ఉద్యోగులు డాన్స్ చేసి తమ ఉద్యోగం పోగొట్టుకున్నారు.
ఇంతకీ వీళ్లు డాన్స్ చేసింది ఎక్కడో తెలుసా? పవిత్రమైన ఆలయంలో. అందుకే ఉద్యోగాలు పోయాయి.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ జిల్లాలో పవిత్ర మహాకాళ్ ఆలయం ఉంది. గుడిలో ఇద్దరు మహిళలు భద్రతా విభాగంలో పనిచేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో గుడి ఖాళీగా ఉండడంతో, ఇద్దరికీ సోషల్ మీడియాలో హంగామా చేయాలనిపించింది.
అంతే, అనుకున్నదే తడవుగా ఓ సినిమా పాట పెట్టారు. ఆ పాటకు డాన్స్ చేశారు. ఆ వీడియోను పోస్ట్ చేశారు. పవిత్ర దేవాలయంలో ఇలా డాన్స్ చేయడంలో ఆ వీడియో వైరల్ అవ్వడం కంటే ముందు వివాదాస్పదమైంది.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు, ఆ వీడియోపై నిజనిర్థారణ కమిటీ వేశారు. విచారణ అనంతరం గుడిలోనే వాళ్లిద్దరూ డాన్స్ చేసిన విషయాన్ని రూఢి చేసుకున్నారు. ఆ వెంటనే ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. అలా అత్యుత్సాహంతో గుడిలో సినిమా పాటకు చిందులేసి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇద్దరు మహిళలు.