మెగాస్టార్ మెగా మూవీ సైరా విడుదలయింది. మంచి టాక్ వచ్చింది. మంచి ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు మీడియా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టింది. కానీ విడుదలకు ముందు సైరా యూనిట్ కు మాత్రం తెలుగు మీడియా అంతగా పట్టినట్లు లేదు. సమాయాభావం అనే సాకు చెప్పి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ తెలుగు మీడియాకు దూరంగా వున్నారు. ఒకే ఒకసారి మీడియా ముందుకు వచ్చారు.
కీలక మీడియాను అంతా వదిలేసి కేవలం కేవలం ఆంధ్రలో అవసరం కోసం అన్నట్లు ఓ సెక్షన్ మీడియాకు మాత్రమే ఇంటర్వూ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సైరాకు తెలుగు మీడియా తనంతట తన ఆసక్తితో ఇచ్చిన ప్రచారం తప్ప, యూనిట్ చేసిన ప్రయత్నం తక్కువే. మెగాస్టార్, రామ్ చరణ్ చుట్టూ వున్న అరడజనుకు పైగా జనాలు అంతా సినిమా మార్కెటింగ్ వ్యవహారాల్లోనే బిజీ అయ్యారు. వాళ్లతో పాటే వీళ్లూ అదే పనిమీద దృష్టిపెట్టారు.
దీంతో తెలుగు మీడియాకు కనీసం పబ్లిసిటీ మెటీరియల్ ఇచ్చేవారు కూడా కరువయ్యారు. టీవీ 9 ఎన్టీవీ లాంటి ప్రధాన చానెళ్లన్నింటినీ విడుదులకు ముందు పక్కన పెట్టారు. అదేవిధంగా బాలీవుడ్ లో మీడియాకు ప్రత్యేకంగా ముందు రోజే షో ఏర్పాటు చేసి, అక్కడ నుంచి ముందుగా మంచి ప్రశంసలు దక్కించుకునే ప్రయత్నం చేసారు తప్ప, ఇక్కడ మీడియాకు సరైన విధంగా షో ఏర్పాటు కూడా చేయడానికి కిందా మీదా అయ్యారు. ఆఖరికి ఏదో చేసాం అంటే చేసాం అనిపించుకున్నారు.
ఇక ఇప్పుడు సినిమా విడుదల కార్యక్రమం పూర్తయింది. తెలుగు మీడియా నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే పది రోజుల పాటు కలెక్షన్లు నిలబడాలి. అందువల్ల ఇక సినిమాకు ప్రచారం ముమ్మరం చేయాల్సిన అవసరం వుంది.
మెగా ఫ్యాన్స్ లో కూడా సినిమా పబ్లిసిటీ మీద కాస్త అసంతృప్తి అయితే వుందని వినిపిస్తోంది. అయితే బాస్ సినిమా కాబట్టి వారిలో వారు డిస్కషన్లు పడ్డారు తప్ప ఓపెన్ కాలేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సినిమాకు గట్టి మద్దతుగా నిలబడ్డారు.
మరి ఇక ఇప్పుడైనా పద్దతిగా ప్రచారం చేస్తారని అనుకోవాలి. మెగాస్టార్ కూడా సినిమా విడుదల తరువాత తెలుగు పబ్లిసిటీ మీద దృష్టి పెడతానని చెప్పినట్లు తెలుస్తోంది. అలా వుండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమాను చాలా ఎక్కువ రేట్లకు మార్కెట్ చేసారు.
అందువల్ల ఇక ముందు ముందు సైరా ప్రచారం పీక్స్ లో వుంటుందని అనుకోవచ్చు. అలా చేయడం తప్పనిసరి. మెగాస్టార్, రామ్ చరణ్ అందరూ రంగంలోకి దిగాల్సిందే. మీడియా ముఖంగా సినిమాకు ప్రచారం సాగించి, కలెక్షన్లు నిలబెట్టి తీరాల్సిందే.