సినిమా రిలీజ్ కోసం ఎంత భారీ ఏర్పాట్లు చేశారో.. పైరసీని అరికట్టడం కోసం కూడా అదే స్థాయిలో భారీగా వర్క్ చేసింది మెగా కాంపౌండ్. వీడియోస్ మాత్రమే కాకుండా.. చిన్న చిన్న స్క్రీన్స్ షాట్స్ సైతం సోషల్ మీడియాలో కనిపించకుండా చేసింది. అభిమానులు కొందరు సరదాగా ట్విట్టర్, ఫేస్ బుక్ లో పెట్టిన స్క్రీన్ షాట్స్ కూడా డిలీట్ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని ఎకౌంట్స్ కూడా సస్పెండ్ అయ్యాయి. ఇంత పకడ్బందీగా పని ప్రారంభించిన సైరా టీం, కీలకమైన టైమ్ వచ్చేసరికి చేతులెత్తేసింది. అడ్డంగా దొరికిపోయింది.
అవును.. నిన్న ఉదయం 6 గంటల నుంచే వర్క్ స్టార్ట్ చేసిన సైరా టెక్నికల్ టీమ్… పైరసీని మాత్రం అడ్డుకోలేకపోయింది. పైరసీకి అడ్డాగా మారిన తమిళ రాకర్స్ ఈ సినిమాను పైరసీ చేసి ఫుల్ మూవీని నెట్ లో అప్ లోడ్ చేసింది. మార్నింగ్ షోలు ముగిసి, మధ్యాహ్నం షో కూడా ప్రారంభం కాకముందే సైరా ఫుల్ మూవీ పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సాయంత్రం సరికి ఆ లింక్స్ వాట్సాప్, ఫేస్ బుక్ లో వైరల్ అయ్యాయి కూడా. దీంతో సైరా యూనిట్ తలపట్టుకుంది.
పైరసీ లింక్స్ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా ఓ ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసింది యూనిట్. ఫ్యాన్స్ సహాయంతో ఆ మెయిల్ ఐడీని బాగానే అందరికీ చేరేలా చేసింది. ఇప్పుడా మెయిల్ ఐడీకి కుప్పలు తెప్పలుగా పైరసీ లింక్స్ వస్తున్నాయి. ఎన్ని తొలిగిస్తున్నప్పటికీ.. తమిళ రాకర్స్ బృందం మాత్రం రకరకాల సర్వర్ల నుంచి, రకరకాల వెబ్ సైట్స్ నుంచి లింక్స్ ను తిరిగి అప్ లోడ్ చేస్తూనే ఉంది. దీంతో రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు.
సినిమా పైరసీపై ఈరోజు అధికారికంగా ఫిర్యాదు చేయబోతోంది యూనిట్. నిజానికి ఈ వీకెండ్ ముగిసేవరకు పైరసీ జరగకుండా ఆపాలనేది యూనిట్ టార్గెట్. కనీసం మొదటి 3 రోజులైనా పైరసీని అడ్డుకోవాలని గట్టిగానిర్ణయించుకుంది. కానీ మొదటిరోజే పైరసీ అవ్వడంతో సైరా యూనిట్ తట్టుకోలేకపోతోంది. ఓవైపు అభిమానులు పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తున్నప్పటికీ, పైరసీని ఆపడం ఎవరితరం కావడంలేదు.