ఉత్తరాంధ్రాకు వైద్య కళాశాలలు వరసగా వస్తున్నాయి. మూడు జిల్లాలు ఆరు అయ్యాయి. దీంతో కొత్తగా వైద్య కళాశాలకు జిల్లాకు ఒకటి వంతున ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇపుడు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఆరు వందల కోట్ల రూపాయలతో పార్వతీపురం మన్యంజిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వైద్యకళాశాలకు టీచింగ్ ఆసుపత్రితో పాటు హాస్టళ్ళు, క్వార్టర్లు, నర్సింగ్ కాలేజీ అనుబంధ భవనాలన్నీ కలిపి ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
కొత్త వైధ్య కళాశాలకు పాలనాపరమైన అనుమతులు అన్నీ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తోంది. తొందరలోనే ఇక్కడ కూడా భవనాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారని అంటున్నారు.
కొన్నేళ్ళ వరకూ చూస్తే వైద్య కళాశాల అంటే ఒక్క విశాఖపట్నంలోనే ఉండేది. ఇపుడు అది కాస్తా మారు మూలకు రావడం, ఏజేన్సీ ప్రాంతానికి కూడా ఆ అవకాశం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రానున్న రోజుల్లో వైద్య రంగంలో కీలక మార్పులకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది అని అంటున్నారు.