భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం అయిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఊరటను ఇచ్చే ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ప్రజల తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉండగా… ఈ నెల ఎనిమిదో తేదీన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ హల్చల్ చేస్తున్నాయి. వీటి అంచనాల ప్రకారం.. గుజరాత్ లో మరోసారి భారతీయ జనతా పార్టీ పాగా వేయనుంది. అది కూడా ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల కన్నా బీజేపీకి మెరుగైన స్థాయిలో సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవంగా చెబుతున్నాయి!
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీకి 99 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ కు 77 సీట్లు దక్కాయి. అంతకు ముందు ఐదేళ్ల కిందటితో పోలిస్తే బీజేపీ కొద్ది మేర బలాన్ని కోల్పోయింది. అయితే ఈ సారి మాత్రం బీజేపీకి కనిష్టంగా 120 సీట్లు, గరిష్టంగా 150 సీట్ల వరకూ దక్కినా ఆశ్చర్యం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండటం గమనార్హం!
182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్ లో బీజేపీకి 120 సీట్లు దక్కినా అది గొప్ప విజయమే అవుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే ఇరవై యేళ్ల పై నుంచినే బీజేపీ అక్కడ అధికారాన్ని చలాయిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మరోసారి విజయం దక్కితే గుజరాత్ పై బీజేపీ ఆధిపత్యం మరోసారి రుజువవుతుంది. అందులోనూ ఈ సారి గుజరాత్ బరిలోకి ఆప్ దిగింది. అర్బన్ ఓటర్ల పార్టీగా పేరున్న ఆప్ గుజరాత్ లో సంచలనం నమోదు చేసేస్తుందేమో అనేంత స్థాయిలో కాస్త హడావుడి జరిగింది.
కాంగ్రెస్ కూడా ఐదేళ్ల కిందట తన స్థాయిని గుజరాత్ లో కొంత పెంచుకుంది. 77 అసెంబ్లీ సీట్ల స్థాయిలో నెగ్గి ఉనికిని చాటుకుంది. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ లో ఏమైనా సంచలనం చోటు చేసుకుంటుందా! అనే విశ్లేషణలకు కాస్త తావు దక్కింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాయి. ఐదేళ్ల కిందటి కన్నా ఈ సారి బీజేపీకి మరింత మెరుగైన స్థాయిలో సీట్లు దక్కుతాయని ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికలపై పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం ప్రభావం చూపిందేమో! అందుకే అప్పుడు బీజేపీకి కాస్త తక్కువ స్థాయి సీట్లు దక్కాయేమో! ఈ సారి పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ తో సహా అప్పుడు కాంగ్రెస్ వైపు నిలిచిన చాలా మంది కమలానికి జై కొట్టారు. ఆ ప్రభావం కూడా ఫలితాలపై పడిందేమో! అయితే ప్రస్తుతానికి విడుదలైనది కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.