ఎన్టీఆరే బ‌తికి ఉంటే…

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆరే బ‌తికి ఉంటే? ….ఇప్పుడీ ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనికి కార‌ణం తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే. Advertisement టీడీపీ…

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆరే బ‌తికి ఉంటే? ….ఇప్పుడీ ప్ర‌శ్న సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దీనికి కార‌ణం తాజాగా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే.

టీడీపీ చెబుతున్న ప్ర‌కారం …పాల‌క పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అప్ర‌జాస్వామిక విధానాల‌కు పాల్ప‌డుతుంటే, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి పోరాడాల్సిన స‌మ‌యంలో, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా చేతులెత్తేయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి అవుతోంది.

ఈ సంద‌ర్భంగా టీడీపీ ఆవిర్భావాన్ని పుర‌స్క‌రించుకుని నాడు దివంగ‌త ఎన్టీఆర్ ఆవేశం, భావోద్వేగం కూడిన స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఎన్టీఆర్ స్పీచ్‌లోని ప్ర‌ధాన అంశాల గురించి తెలుసుకుందాం.

“రాజ‌కీయం  వ్యాపారాత్మ‌క‌మై, ద‌గాకోరు విధాన‌మై , ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే, గుండె బ‌ద్ద‌లై, మ‌న‌సు విక‌ల‌మై, ఓరిమి ప‌ట్ట‌లేక మీ కోసం వ‌చ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమ‌ట‌లోంచి పుట్టింది. కార్మికుడి కండ‌రాల్లోంచి పుట్టింది. రైతు కూలీల ర‌క్తంలోంచి పుట్టింది. నిరుపేద‌ల క‌న్నీటిలో నుంచి, క‌ష్ట‌జీవుల కంటి మంటల్లోంచి, అన్నార్తుల ఆక్రంద‌న ల్లోంచి, పుట్టిందీ తెలుగుదేశం. తెలుగువారి పౌరుషం చాటి చెప్ప‌డానికి, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం నిల‌బెట్ట‌డానికి పుట్టిందీ తెలుగుదేశం. ఆశీర్వ‌దించండి”

ఈ ప్ర‌సంగం విన్న వాళ్లెవ‌రికైనా రోమాలు నిక్క‌బొడుచుకోకుండా ఉండ‌వు. మ‌న‌సులోతుల్లోంచి ఆవేశం త‌న్నుకు రాకుండా ఉండ‌దు. అక్ర‌మాల‌పై పిడికిలి బిగించ‌కుండా ఉండ‌లేరు. కానీ నేడు చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీలో ఏదీ ఆ స్ఫూర్తి? ఏదీ నాటి నిబ‌ద్ధ‌త‌? ఏదీ నాటి పౌరుషం?

ఓట‌మి భ‌యంతో అధికార పార్టీపై నింద‌లు మోపి, ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డ‌మేనా నేటి టీడీపీ నీతి, రీతి? తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం నిల‌బెట్ట‌డానికే పుట్టిందీ తెలుగుదేశం అని గుండెలు చీల్చుకుంటూ నాడు ఎన్టీఆర్ చెప్పిన మాట‌ల‌ను చంద్ర‌బాబు, ఆ పార్టీ నేత‌లు ఏమ‌ర్థం చేసుకున్న‌ట్టు? అస‌లు ఆత్మ‌గౌర‌వం అనేదే టీడీపీ నేత‌ల‌కు ఉంటే… ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌నే నీతిబాహ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంటారా?

పరిషత్‌ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతాయనే నమ్మకం తమకు లేదని.. ఈ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని చంద్ర‌బాబు చెప్ప‌డం ద్వారా త‌న‌ను ఆత్మ వంచ‌న చేసుకోవ‌డం కాదా? న‌మ్మ‌కం లేంది పార్టీ విజ‌యాల‌పైనా? లేక ఎన్నిక‌ల‌పైనా? ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం ప్ర‌జాస్వామిక‌మ‌ని ఏ రాజ్యాంగంలో ఉందో కాస్త చెప్ప‌రా? ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉందని చెప్ప‌డం ఏంటి?

పైగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ముక్తాయింపు ఇవ్వ‌డం దేనికి సంకేతం? ప్రజల్లో చైత‌న్యానికి సంబంధించి ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. తాము గెలిస్తే త‌ప్ప ప్ర‌జ‌ల్లో చైత‌న్యం లేద‌ని టీడీపీ భావిస్తోందా?  ప్ర‌జ‌ల్ని కించ‌ప‌రిచే ఇలాంటి వ్యాఖ్య‌లే త‌మ పార్టీ ప‌త‌నానికి దారి తీస్తున్నాయ‌ని చంద్ర‌బాబు గ్ర‌హించ‌క‌పోవ‌డం గ‌మనార్హం. 

40 ఏళ్ల టీడీపీ ప్ర‌స్థానంలో నేడు ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకునే స్థాయికి పార్టీని దిగ‌జాచ్చిన ఈ స‌మయంలో… ఆ ఎన్టీఆరే బ‌తికి ఉంటే ఏం చేసుకునే వాళ్లో చెప్ప‌డానికి మాట‌లు రావ‌డం లేదు. ఆయ‌న చ‌నిపోయి బ‌తికిపోయారంటే అతిశ‌యోక్తి కాదేమో!