మరో వివాదంలో చిక్కుకున్న ఏఆర్ రెహ్మాన్

మొన్నటికిమొన్న చెన్నైలో జరిగిన లైవ్ కన్సర్ట్ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు రెహ్మాన్. వీఐపీ పాసులున్నప్పటికీ స్టేడియంలోకి అడుగుపెట్టలేనంత నిర్వహణ లోపం వల్ల ఆ షో పై విమర్శలు చెలరేగాయి. ఇప్పుడీ సంగీత దర్శకుడు మరోసారి…

మొన్నటికిమొన్న చెన్నైలో జరిగిన లైవ్ కన్సర్ట్ విషయంలో వివాదాల్లో ఇరుక్కున్నాడు రెహ్మాన్. వీఐపీ పాసులున్నప్పటికీ స్టేడియంలోకి అడుగుపెట్టలేనంత నిర్వహణ లోపం వల్ల ఆ షో పై విమర్శలు చెలరేగాయి. ఇప్పుడీ సంగీత దర్శకుడు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈసారి తన వర్క్ కు సంబంధించి రెహ్మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇటీవలే విడుదలైన ‘పిప్పా’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రంలో దివంగత బెంగాలీ కవి కాజీ నజ్రుల్‌ ఇస్లాం రచించిన దేశ భక్తి గీతం ‘కరార్‌ ఓయ్‌ లౌహో కోపట్‌’ను వాడుకున్నారు. అయితే రెహమాన్‌ ఈ గీతం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా మార్పులు చేసి తన సినిమాకు వాడుకున్నారని నజ్రుల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.

రెహమాన్‌ అడగడంతో ఎలాంటి మార్పులు చేయకుండా ఆ గీతాన్ని సినిమాలో వాడుకునేందుకు అనుమతించారు నజ్రుల్ కుటుంబ సభ్యులు. దానికి సంబంధించిన పత్రంపై నజ్రుల్ కుమార్తె సంతకం చేశారు. అయితే ఊహించని విధంగా పాట బాణీని మార్చేశారని, కనీసం టైటిల్స్‌లో తమకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదని నజ్రుల్ కుటుంబం ఆరోపిస్తోంది. 

ఒరిజినల్ ‌ట్యూన్‌ను మార్చి, పాటలో ఆత్మను రెహమాన్ చంపేశారని ఆరోపిస్తున్నారు నజ్రుల్ మనవడు కాజీ అనిర్బన్. అటు అమెరికాలో ఉంటున్న నజ్రుల్ మనవరాలు అనిందిత కాజా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తమ మనసులు గాయపరిచారని ఆమె వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై యూనిట్ వెంటనే స్పందించింది. క్షమాపణలు కూడా కోరింది. అయితే నజ్రుల్ కుటుంబం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తక్షణం సినిమా నుంచి ఆ పాటను తొలిగించాలని, మిగతా పబ్లిక్ డొమైన్స్ నుంచి కూడా డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. 

ఇషాన్ కట్టర్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పిప్పా. 1971లో జరిగిన ఇండియా-పాక్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో దేశభక్తిని పెంపొందించేలా నజ్రుల్ పాటను వాడుకున్నాడు రెహ్మాన్. వందేమాతరం సాంగ్ ను మార్చినట్టు.. ఈ పాటను కూడా తనదైన శైలిలో మార్చేశాడు. అదే ఇప్పుడు వివాదాస్పదమైంది.