ఆంధ్ర సెటిలర్లు అందరూ బీఆర్ఎస్ అంటే విముఖతతో వున్నారా? వుంటే అది కేవలం కేసీఆర్-జగన్ మిత్రులు కావడం వల్లనేనా? ఇంకేదైనా కారణం వుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సి వుంది.
నిజానికి గ్రౌండ్ లెవెల్ రియాల్టీ ఏమిటంటే సెటిలర్లు అందరూ బీఆర్ఎస్ అంటే విముఖతతో లేరు. అది వాస్తవం. కమ్మ.. రెడ్డి సామాజిక వర్గాలు వారి వారి కారణాల వల్ల కొంత వరకు వ్యతిరేకతతో వుంటే వుండొచ్చు. కానీ మిగిలిన కమ్యూనిటీలు కొంత వరకు బీఆర్ఎస్ తోనే వున్నాయి.
కానీ కొంత వరకు వ్యతిరేకత వారిలో కూడా వుంది. ఎందుకు అంటే హైదరాబాద్లో సామాజిక అసమానతలు బాగా పెరిగిపోతుండడం వల్ల. సెటిలర్లలో ఎక్కువ మంది మధ్య తరగతి వారే. వీళ్లందరికీ హైదరాబాద్ లో ఓ స్వంత ఇల్లు వుండాలన్నది కల. ఒకప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్ మెంట్ లు వుండేవి. కాస్త అందుబాటులోనే వుండేవి. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ ఎమినిటీస్ వచ్చిన తరువాత ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. పైగా రింగ్ రోడ్ చుట్టూ ఆర్టిఫిషియల్ ప్రయిస్ రైజ్ అన్నది క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ రోజున కోటిన్నర లేకుండా అపార్ట్ మెంట్ కొనలేని పరిస్థితి. అభివృద్ది అంతా గచ్చిబౌలి, మాదాపూర్, రింగ్ రోడ్ దగ్గర కేంద్రీ కృతమైపోయింది. దాంతో జనాలకు కాస్త కినుకగా వున్న మాట వాస్తవం.
ఒక పక్క అందుకోలేని అపారమైన అభివృద్ది కనిపిస్తోంది. అందుకోవాలనే ఆశ వుంది. కానీ మధ్యతరగతికి అది గగన కుసుమం లా వుంది. అందుకే ఈ పరిస్థితికి బీఆర్ఎస్ ప్లాన్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యూహం అనే అనుమానం వుంది.
బీఆర్ఎస్ వల్ల ఇక్కడ భూములు వున్న వారికి లబ్ది. ఇక్కడి వారికి లబ్ది. కానీ సెటిలర్లకు ఏం జరగడం లేదు. ఒరగడం లేదు. పోనీ కష్టపడి కొనుక్కుందామా అంటే అందుబాటులో లేని వ్యవహారం. అందుకే ఇప్పుడు ఆ పార్టీ మీద కాస్త కినుక వుంది.