పవన్ కల్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్నారనే విషయం ఆయన మాటల ద్వారానే అందరికీ తెలిసింది. ఓ సమావేశానికి రాలేనంటూ బహిరంగ లేఖ రాస్తూ తన వెన్నునొప్పి విషయాన్ని బైటపెట్టారు జనసేనాని. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా తాను ప్రకృతిసిద్ధమైన వైద్యానికే మొగ్గుచూపుతున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఒక్కసారిగా మాయమయ్యారు. ట్విట్టర్ లో మినహా పవన్ ఎక్కడా కనిపించడం లేదు.
అక్టోబర్-2, గాంధీ జయంతి రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూడా పవన్ ఎక్కడా కనిపించలేదు. సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత పవన్ కల్యాణ్ పెద్దగా కెమెరాలను ఫేస్ చేయలేదు. ఆమధ్య వాటర్ మాన్ రాజేంద్రసింగ్, పవన్ ను కలిశారంటూ రెండు ఫొటోలు రిలీజ్ చేయడం మినహా పవన్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనే విషయం బైట ప్రపంచానికి తెలియడం లేదు. రోజూ పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి ట్విట్టర్ పోస్టింగ్ లు వస్తున్నా, ట్విట్టర్ లో పవన్ ఫొటో కనపడి పది రోజులవుతోంది.
పవన్ ఇలా హఠాత్తుగా మాయం కావడం కామనే అనుకున్నా.. ఈసారి ఆయన ఆరోగ్య పరిస్థితి జనసైనికుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పి చికిత్స కోసమే పవన్ కల్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఆపరేషన్ పై ఆసక్తి చూపించని పవన్ కేరళ వైద్యంపై నమ్మకం పెట్టుకున్నారట. పది రోజులుగా పవన్ కల్యాణ్ కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని, అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరు నిపుణుల పర్యవేక్షణలో పవన్ కి ప్రత్యేక చికిత్స చేస్తున్నారు.
వెన్ను నొప్పికి తాత్కాలిక ఉపశమనం కంటే, పూర్తిగా నయం కావాలంటే.. చికిత్స తర్వాత పవన్ కనీసం నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. వెన్ను నొప్పి తీవ్రంగా ఉండటంతో.. ఇన్నాళ్లూ పట్టించుకోని పవన్ కూడా ఈ దఫా విశ్రాంతి తీసుకోడానికే మొగ్గుచూపుతున్నారట. అయితే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే బాగుండేది. ఎలాంటి ప్రకటన చేయకుండా, కనిపించకుండాపోవడంతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ కోలుకుని, మళ్లీ జనంలోకి రావాలని కోరుకుందాం.