చరిత్ర ప్రారంభం.. జగన్ చేతుల మీదుగా ఆరంభం

అందరూ చరిత్రను చదువుతారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. సీఎం వైఎస్ జగన్ రెండో కేటగిరీలోకి వస్తారు. గ్రామ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం దిశగా తాను కన్న కలను నిజం చేయడం కోసం వడివడిగా…

అందరూ చరిత్రను చదువుతారు. కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు. సీఎం వైఎస్ జగన్ రెండో కేటగిరీలోకి వస్తారు. గ్రామ స్వరాజ్యం, ప్రజల సంక్షేమం దిశగా తాను కన్న కలను నిజం చేయడం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ తలపెట్టిన ప్రతిష్టాత్మక గ్రామ సచివాలయాలు ఇవాళ్టి నుంచి కార్యాచరణలోకి వచ్చాయి. 

ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవల్ని అందించడంతో పాటు, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించే సమున్నత లక్ష్యంతో, ఎంతో ఆలోచించి జగన్ ప్రారంభించిన ఓ కొత్త ఒరవడి ఇది. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కలలో కూడా ఊహించని కాన్సెప్ట్ ఇది. ఇంకా చెప్పాలంటే ఇదొక చరిత్ర. ఆ చరిత్రలో మొదటి పేజీ ఈరోజే మొదలైంది.

గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాల కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. ముందుగా 8 సేవలతో మొదలైన సచివాలయ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో 500 సేవలకు విస్తరించనుంది. ఈ మేరకు 2020 జనవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

గ్రామ/వార్డ్ సచివాలయాలతో మరిన్ని అక్రమాలు జరిగే ఆస్కారం ఉందంటూ ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్న వేళ, ఆ దిశగా కూడా సీఎం తగు చర్యలు చేపట్టారు. అవినీతికి పాల్పడినట్టు తెలిసిన మరుక్షణం ఉద్యోగాలు పోతాయని కొత్తగా విధుల్లో చేరిన ఉద్యోగస్తులకు హెచ్చరించారు జగన్. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండవని, తగినంత జీతం పొందడంతో పాటు పేదలకు సేవ చేసే అవకాశం నేరుగా లభించినందుకు అంతా గర్వంగా ఫీలవ్వాలని సూచించారు. మరోవైపు ప్రజలకు కూడా చైతన్య కలిగించేందుకు ఓ టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటుచేశారు. అవినీతి, అక్రమాలు జరిగినట్టు అనిపిస్తే 1902 నంబర్ కు ఫోన్ చేసి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడొచ్చని భరోసా ఇచ్చారు.

ఈ ఒక్కరోజే 1,34,978 మంది విధుల్లో చేరారు. ఏడాది చివరినాటికి మిగిలిన ఖాళీల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. ఇది చరిత్రలో తొలి అడుగు మాత్రమే. ఇది విప్లవానికి ఆరంభం మాత్రమే. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన జగన్.. ఇకపై ఇదే తరహా విప్లవాన్ని మిగతా అన్ని రంగాలకు విస్తరించబోతున్నారు. ఇదే నెలలో వైఎస్ఆర్ రైతుభరోసా కార్యక్రమం అమలుకాబోతోంది. త్వరలోనే అమ్మఒడి కార్యక్రమం అమలవుతుంది. ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందబోతున్నాయి. ఇలా జగన్ పాలన చరిత్రలో నిలిచిపోనుంది. దానికి ఏపీ ప్రజలు సాక్ష్యంగా నిలవబోతున్నారు.