పవన్ ను నమ్ముకంటే అంతే హరీష్ శంకర్

ఎలాంటి దర్శకుడు. ఇప్పటికీ మాస్ సినిమా అభిమానులు కోరుకునే దర్శకుడు. గబ్బర్ సింగ్..డిజె..గద్దలకొండ గణేష్ లాంటి మాంచి మాస్ సినిమాలు అందించి సూపర్ అనిపించుకున్నవాడు. హరీష్ శంకర్. చేతిలో సినిమా లేకుండా కూర్చునే పరిస్థితి.…

ఎలాంటి దర్శకుడు. ఇప్పటికీ మాస్ సినిమా అభిమానులు కోరుకునే దర్శకుడు. గబ్బర్ సింగ్..డిజె..గద్దలకొండ గణేష్ లాంటి మాంచి మాస్ సినిమాలు అందించి సూపర్ అనిపించుకున్నవాడు. హరీష్ శంకర్. చేతిలో సినిమా లేకుండా కూర్చునే పరిస్థితి. కేవలం పవన్ కళ్యాణ్ అనే హీరో వల్ల. అంతకు మించి మరేం కాదు. మైత్రీ మూవీస్ కు హరీష్ శంకర్ కు సినిమా చేస్తానన్నది పవన్ మాట. 45 కోట్ల అడ్వాన్స్ అని టాక్. వడ్డీల మీద వడ్డీలు పేరుకుంటున్నాయి. సినిమా టీమ్ పోషణ సంగతి సరే సరి. కానీ అక్కడి నుంచి మాత్రం అంతంత మాత్రం రెస్పాన్స్.

అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం అంటాడు. ప్రేమంటుంది… కాదంటుంది..ఏదో చెబుతుంది. అర్థం కావడంలేదు..నువ్వు కనుక్కో చారీ అని. పాపం హరీష్ పరిస్థితి అలాగే వుంది. పవన్ సినిమా చేయను అనడు కానీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. 

పవన్ దగ్గరకు వెళ్తే కథ అంటారు. హరీష్ శంకర్ లాంటి డైరక్టర్ కథ చెప్పి ఒప్పించలేకపోవడం ఏమిటి? భవదీయుడు భగత్ సింగ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ పెట్టకున్నారు అంటే దానికి తగిన కథ వుండే వుంటుంది కదా. మరి అలాంటి కథను పవన్ ఒప్పుకోకపోవడం ఏమిటి? నిజంగా కథ బాగాలేదా? ఒప్పుకోలేదన్న వార్తలు కరెక్ట్ కాదా? పవన్ ను ఒప్పించే లెవెల్ కథను హరీష్ చేయలేకపోతున్నారంటే నమ్మగలమా? మరి అక్కడ ఏ శక్తి అడ్డం పడుతోంది. ఇవన్నీ అనుమానాలే.

అసలు ఇక్కడ ఇంకో పాయింట్ వుంది. హరీష్ రీమేక్ స్పెషలిస్ట్…పవన్ కూడా డిటో..డిటో..అలాంటి ఇద్దరు కలిసి ఒరిజినల్ కథ చేయాలని అనుకోవడం భలే గమ్మత్తు. ఇప్పుడు మళ్లీ ఇద్దరు కలిసి తెరి రీమేక్ మీదకు వచ్చారని వార్తలు వినిపించడం ఇంకా గమ్మత్తు. అసలు కనీసం పవన్ తరువాత చేస్తా..ఓ సినిమా చేసుకు రండి అని ఓ మాట చెప్పి వుంటే హరీష్ ఈపాటికి మిడ్ రేంజ్ హీరోలతో రెండు సినిమాలు చేసి వుండేవారు. కానీ అలా అనడం లేదో తెలియదు. ఈయన అటుగా ఆలోచించి వుండరో తెలియదు.

మొత్తం మీద ఏదో జ‌రుగుతోంది. సినిమాల్లో డైలాగుల్లా ‘ఏదో శక్తి అడ్డం పడుతోంది’ అనుకోవాలేమో? ఈ నెలలో కూడా హరీష్ శంకర్ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందా? వచ్చినా సమస్యే..రాకపోయినా సమస్యే.  ఎందుకంటే ఒకసారి అనౌన్స్ మెంట్ జ‌రిగిపోతే ఇక పవన్ డేట్ లు ఇచ్చి సినిమా అయ్యే వరకు అలా వుండాల్సిందే. రాముడి కోసం చూస్తూ వుండిపోయినా భద్రుడిలా. రాకపోయినా సమస్యే ఎందుకంటే పవన్ సినిమా ఎప్పుడు అనే ఆశతో వుండిపోవాలి.