మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ ఓ మాట అంటే, మంచు విష్ణు రెండు అంటున్నాడు. మంచు విష్ణు కామెంట్స్ కు వెంటనే ప్రకాష్ రాజ్ సమాధానం ఇస్తున్నాడు.
ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. తాజాగా వీళ్లిద్దరి మధ్య వివిధ మాధ్యమాల్లో జరిగిన వాగ్వాదాన్ని పాయింట్ టు పాయింట్ చూద్దాం.
ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత కూడా మీ (మంచు విష్ణు) సినిమా బడ్జెట్ ఉండదు? ఇలాంటి వ్యక్తులు కూడా పవన్ కల్యాణ్ ను విమర్శిస్తున్నారు.
మంచు విష్ణు: పవన్ కల్యాణ్ ను నేను విమర్శించలేదు. వాస్తవం చెప్పానంతే. ఆంధ్రప్రదేశ్ లో నాకు విద్యాసంస్థలున్నాయి. జగన్ గారు ఫీజులు తగ్గిస్తున్నారు. అదే క్రమంలో థియేటర్ టిక్కెట్ రేట్లు కూడా తగ్గిస్తున్నారు. దానిపై చర్చ జరుగుతోంది. అంతలోనే పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ మద్దతిస్తున్నారు. సినిమా బడ్జెట్ అనేది హీరో మార్కెట్ బట్టి ఉంటుంది. హీరోకు ఉండే కష్టాలేంటో, ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తెలియకపోవచ్చు.
ప్రకాష్ రాజ్: నన్ను తెలుగువాడు కాదంటారా? నా కంటే బాగా తెలుగు మాట్లాడే వారు ఆ ప్యానెల్ లో ఉన్నారా? నా అంత తెలుగు మీకు ఎవ్వరికీ రాదు, పలకదు. నేను మాట్లాడితే తెలుగు గర్వపడుతుంది. నన్ను పెంచింది తెలుగుతల్లి. జాతీయ అవార్డు తీసుకొచ్చాను. తెలుగోడు గర్వించేలా చేశాను.
మంచు విష్ణు: ప్రకాష్ రాజ్ తనను తాను ఆత్రేయ వారసుడు అనుకుంటున్నాడు. ఈయన వచ్చి అవార్డులు తెచ్చేదేంటి? తెలుగులో ఆయనకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. అంతేతప్ప, తనకంటే ఎక్కువ అవార్డులు ఏ తెలుగువాడికీ రాలేదనడం అమర్యాదకరం. అంటే.. ఆయన దృష్టిలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, చిరంజీవి నటులు కాదని అర్థమా.
ప్రకాష్ రాజ్: నేను ఒక ఉత్తరం రాస్తే.. మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ ఆఫీస్ కు తాళం పడేది. సౌమ్యంగానే కాదు, కోపంగా మాట్లాడ్డం కూడా నాకు తెలుసు.
మంచు విష్ణు: ప్రకాష్ రాజ్ అహంకారానికి పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. తల్లి లాంటి మా అసోసియేషన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఇదే మాట వెళ్లి నడిగర్ సంఘం ముందు అనగలరా? కన్నడనాట అనగలరా? తెలుగువాళ్లు అంత చులకనగా కనిపిస్తున్నారా? ప్రకాష్ రాజ్ కు ఓటేస్తే తెలుగువాడి ఆత్మగౌరవం
దెబ్బతిన్నట్టే. నో డౌట్.
ప్రకాష్ రాజ్: నటన అనేది నరనరాల్లో ఉంటే కాదు, ముఖంపై కనిపించాలి. రక్తంలో నటన ఉంటే ఎవడిక్కావాలి. తెరపై కనిపించాలి.
మంచు విష్ణు: ప్రకాష్ రాజ్ మంచి నటుడే. అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నటన ఉంటే సరిపోతుందా? అదే రక్తంలో కాస్త వినయం, విధేయత, క్రమశిక్షణ కూడా ఉండాలి. ప్రకాష్ రాజ్ మంచి నటుడే. మరి అలాంటి నటుడ్ని తన సినిమా నుంచి శ్రీనువైట్ల ఎందుకు తప్పించాడు? అసిస్టెంట్ డైరక్టర్ ను అమ్మనా బూతులు తిట్టాడు కాబట్టి. అలాంటి నటుడ్ని టాలీవుడ్ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? ముఖంపై నటన కనిపిస్తే చాలదు, మనసులో వివేకం కూడా ఉండాలి.
ప్రకాష్ రాజ్: నాపై విమర్శలు చేసే వాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. నా కంటే ఆ ప్యానెల్ లో ఎవరు గొప్ప, ఎందుకు గొప్ప చెప్పాలి. నాకు ఏం తక్కువ?
మంచు విష్ణు: చూశారుగా.. దీన్నే నేను అహంకారం అంటాను. ఇంత అహంకారంతో ఉన్న వ్యక్తిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకుంటారా? ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే సభ్యులందరికీ న్యాయం జరుగుతుందా? అంతెందుకు.. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ప్రకాష్ రాజ్ అందుబాటులో ఉంటాడనే గ్యారెంటీ ఒక్కరికైనా ఉందా?
ప్రకాష్ రాజ్: ఛారిటీ అంతా చేస్తున్నామని చెబుతున్నారు. ఎవరు ఎంత ఛారిటీ చేస్తున్నారో నాకైతే కనిపించడం లేదు. నేను చేసే సేవాకార్యక్రమాల్ని మాత్రం అందరూ చూడొచ్చు.
మంచు విష్ణు: కుడిచేత్తో చేసే మంచి పని ఎడమ చేతికి కూడా తెలియకుండా చేస్తాం మేం. ఆయనేదో చీప్ గా భూములు కొనేసి, గ్రామాన్ని దత్తత తీసుకొని బిల్డప్ ఇస్తున్నాడు. నేను 10 గ్రామాల్ని దత్తత తీసుకున్నాను. పైకి చెప్పుకుంటున్నానా? నేను చేసే ఛారీటీ ఏంటే తెలియాలంటే నా ఆఫీస్ కు వచ్చి రికార్డ్స్ చూసుకోండి. నేనే కాదు, బాలకృష్ణ, నాగార్జున ఎంత ఛారిటీ చేస్తున్నారో తెలుసా? వాళ్లు చేస్తున్న ఛారిటీ పనులు బయటకు 10శాతం మాత్రమే వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ లా మేం అలా బయటకొచ్చి సేవ చేస్తున్నామని చెప్పుకోం. ఎందుకంటే మేం తెలుగువాళ్లం.
ప్రకాష్ రాజ్: పెద్దల అవసరం మాకు లేదు. పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి మేం రావడం లేదు. కొందరు పెద్దల్ని ప్రశ్నించడానికే వస్తున్నాం. అసోసియేషన్ లో వెల్ఫేర్ అనేది రిక్వెస్ట్ కాదు. అది డిమాండ్. సభ్యుల హక్కు. ఇదే మా ఎజెండా.
మంచు విష్ణు: పరిశ్రమలో పెద్దల్ని కలిస్తే తప్పేంటి? నేను వాళ్ల ముందే పుట్టాను, వాళ్ల ముందే పెరిగాను. ఓ మంచి పని చేయడానికి ముందు వాళ్లను కలిస్తే తప్పేముంది? పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ప్రకాష్ రాజ్ తప్పంటున్నాడు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. అసోసియేషన్ లో వెల్ఫేర్ అనేది రిక్వెస్ట్ కాదు, హక్కు అంటున్నారు. నిజమే..ప్రకాష్ రాజ్ అధ్యక్షుడితే హక్కులు పోతాయి, రిక్వెస్ట్ చేసుకోవడమే మిగులుతుంది. అది జరగకూడదనే నా ప్రయత్నం.
ప్రకాష్ రాజ్: మంచు విష్ణు నువ్వు ఎక్కువగా వాగుతున్నావ్? నేను ఇంకా ఎక్కువ వాగగలను. నాపై విమర్శలు చేసే వాళ్లు ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మంచు ఫ్యామిలీ కావాలా? మంచి ప్యానెల్ కావాలా అనేది సభ్యులే నిర్ణయించుకోవాలి.
మంచు విష్ణు: మంచు ఫ్యామిలీ కావాలా? మంచి ప్యానెల్ కావాలా అని అంటున్నారు. కానీ జనాలు మరోలా అనుకుంటున్నారు. రెండూ ఒకటే కదా. ఎలా విడిదీస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వాగుడు అనే పదం దుర్భాష. నా నుంచి అలాంటి భాష రాదు. నా పెంపకం అలాంటిది.
ప్రకాష్ రాజ్: ఏదైనా అంటే మాది క్రమశిక్షణ ఉన్న ఫ్యామిలీ అంటారు? మేం బజారులో పుట్టామా? మాకు క్రమశిక్షణ లేదా? మాది కూడా మంచి పెంపకమే.
మంచు విష్ణు: మాది క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీ అని నేను చెప్పలేదు. ఇండస్ట్రీ చెబుతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. క్రమశిక్షణ అనే పదం ప్రకాష్ రాజ్ దృష్టిలో పెద్ద బూతు. ఆయన క్రమశిక్షణ గురించి మాట్లాడితే నాకు నవ్వొస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్య ప్రకాష్ రాజ్ బీపీ టాబ్లెట్లు వేసుకోవడం మరిచిపోతున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు.