ఎన్టీఆర్‌ను గౌర‌విస్తున్నారా? అవ‌మానిస్తున్నారా?

దివంగ‌త ఎన్టీఆర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం గౌర‌విస్తోందా? అవ‌మానిస్తోందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 28న ఆయ‌న పేరుతో రూ.100 నాణేన్ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ము అవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి…

దివంగ‌త ఎన్టీఆర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం గౌర‌విస్తోందా? అవ‌మానిస్తోందా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఈ నెల 28న ఆయ‌న పేరుతో రూ.100 నాణేన్ని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ము అవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్‌, నారా కుటుంబ స‌భ్యుల‌కు ఆహ్వానాలు అందాయి. కానీ ఎన్టీఆర్ స‌తీమ‌ణి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తిని ఆహ్వానించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ఎన్టీఆర్ జీవిత చ‌ర‌మాంకంలో తోడునీడ‌గా ఉన్న ఏకైక వ్య‌క్తి ల‌క్ష్మీపార్వ‌తి మాత్ర‌మే. వేలాది మంది సాక్షిగా ల‌క్ష్మీపార్వ‌తిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. భార్య కంటే మ‌రే వ్య‌క్తి ఎన్టీఆర్‌కు ముఖ్యం కాదు. ఎన్టీఆర్‌ను వృద్ధాప్యంలో ప‌ద‌వీచ్యుతుడిని చేసి, మాన‌సికంగా వేధించి ఆయ‌న చావుకు కార‌ణ‌మ‌య్యార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ర‌క్త సంబంధీకుల‌ను, అల్లుళ్ల‌ను ఆహ్వానించిందని కేంద్ర ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఎవ‌రినో సంతృప్తిప‌ర‌చ‌డానికి భార్య అయిన ల‌క్ష్మీపార్వ‌తిని అవ‌మానించ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబుపై ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో దారుణంగా మాట్లాడిన అంశాలు అంద‌రికీ తెలిసిన‌వే అని గుర్తు చేస్తున్నారు. ల‌క్ష్మీపార్వ‌తిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను గ‌ద్దె నుంచి కూల‌దోయడం చంద్ర‌బాబును జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది. చంద్ర‌బాబు వెన్నుపోటుదారుడిగా తెలుగు రాజ‌కీయాల్లో ముద్ర‌ప‌డ్డారు.

ఎన్టీఆర్‌ను ఎవ‌రైతే మాన‌సికంగా హింసించారో వాళ్లంద‌రినీ ఆహ్వానించ‌డం అంటే.. ఆయ‌న ఆత్మ క్షోభించేలా చేయ‌డమే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. బీజేపీ హిందూ ధ‌ర్మం గురించి నీతులు చెప్ప‌డ‌మే త‌ప్ప‌, ఆచ‌రించ‌ద‌నేందుకు ఎన్టీఆర్ భార్య‌ను అవ‌మానించ‌డాన్ని ఉదాహ‌రిస్తున్నారు. ఇదిలా వుండ‌గా త‌న‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డంపై ల‌క్ష్మీపార్వ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మేర‌కు ఆమె రాష్ట్ర‌ప‌తి, కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రికి లేఖ‌లు రాశారు.