మ‌ళ్లీ ఆయ‌న గెలిస్తే చంద్ర‌మండ‌లం కూడా ఖ‌తం!

తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు. క‌రీంన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్…

తెలంగాణ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు. క‌రీంన‌గ‌ర్‌లో అభివృద్ధి ప‌నుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని విమ‌ర్శించారు. త‌మ పార్టీ గ్రాఫ్ ప‌డిపోలేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ స‌త్తా ఏంటో తెలుస్తుంద‌న్నారు. కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే చంద్ర‌మండ‌లం కూడా ఖ‌తం అవుతుంద‌న్నారు. చంద్రుని మీద కూడా భూములిస్తామ‌ని కేసీఆర్ మాయ మాట‌లు చెబుతార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఇదిలా వుండ‌గా కేసీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సీట్ల‌లో స‌గం మందికి బీ ఫారాలు ద‌క్క‌వ‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ ప్ర‌క‌టించిన‌వ‌న్నీ ఉత్తుత్తి సీట్లే అని ఆయ‌న విమ‌ర్శించారు.

కేసీఆర్ ఒక‌రికి సీటు ఇచ్చి, మ‌రొక‌రిని ఇంటికి పిలిపించి మాట్లాడుతున్నార‌ని చెప్పుకొచ్చారు. కేసీఆర్ బిడ్డ‌కు సీటు ఇస్తే మ‌హిళ‌ల‌కు 33 శాతం ఇచ్చిన‌ట్టేనా అని ఆయ‌న నిల‌దీయడం గ‌మ‌నార్హం. మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, బీసీల గురించి మాట్లాడే హ‌క్కు కేసీఆర్‌కు లేద‌ని ఆయ‌న అన్నారు. మ‌హిళ‌ల‌ను అవ‌హేళ‌న చేయ‌డం మాని 33 శాతం రిజ‌ర్వేష‌న్ బిల్లు పెట్టేందుకు బీజేపీ స‌ర్కార్ చిత్త‌శుద్ధితో ప‌ని చేయాల‌ని కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్యే క‌విత చుర‌క‌లు అంటించిన సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో ఆమె ఢిల్లీ వేదిక‌గా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం పోరాటం చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ ఇచ్చార‌ని, బీఆర్ఎస్ టికెట్ల‌లో మాత్రం మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌ని ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డుతున్నారు. తెలంగాణలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశం మాట‌ల తూటాల పేల్చివేత‌కు దారి తీసింది.