తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు సమసిపోయినట్టేనా? అనే చర్చకు తెరలేచింది. ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా ఉప్పు, నిప్పులా వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి కూడా కేసీఆర్ దిగిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం పంపే బిల్లులపై కాలయాపన చేస్తుండడం వివాదాస్పదమైంది. ఇలా అనేక వివాదాలు పెరిగి పెద్దవై రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకునేలా చేసింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ సచివాలయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను కేసీఆర్ సర్కార్ ఆహ్వానించింది. మొదటిసారి సచివాలయంలో అడుగు పెట్టిన గవర్నర్‌కు కేసీఆర్ సహా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. సచివాలయ ప్రారంభానికి గవర్నర్‌ను ఆహ్వానించని సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
సచివాలయ ప్రాంగణంలో మొదట నల్ల పోచమ్మ ఆలయాన్ని, ఆ తర్వాత చర్చి, అనంతరం మసీదును కేసీఆర్, తమిళిసై ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేశారు. మూడు మతాల పెద్దలు హాజరై సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటిసారి సచివాలయానికి వెళ్లిన గవర్నర్ తమిళిసై సీఎం కార్యాలయాన్ని, పలువురు ఉన్నతాధికారుల చాంబర్లను పరిశీలించడం విశేషం. ఇక మీదటైనా గవర్నర్, సీఎం మధ్య సంబంధాలు సజావుగా సాగాలని పలువురు ఆకాంక్షించారు.