ష‌ర్మిలా…మానుకోట రాళ్ల దాడి మ‌రిచిపోవద్దు!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు. దీంతో ఆమె విమ‌ర్శ‌ల‌ను ఇక ఉపేక్షించొద్ద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇక‌పై సీఎం కేసీఆర్‌పై చిల్ల‌ర విమ‌ర్శ‌లు చేసే వారిని…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు. దీంతో ఆమె విమ‌ర్శ‌ల‌ను ఇక ఉపేక్షించొద్ద‌ని టీఆర్ఎస్ నేత‌లు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఇక‌పై సీఎం కేసీఆర్‌పై చిల్ల‌ర విమ‌ర్శ‌లు చేసే వారిని ఉరికించి కొట్టాల‌ని ప‌రోక్షంగా ష‌ర్మిల‌పై దాడి చేయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌య క‌విత‌, త‌న‌యుడు కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేత‌ల‌పై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల రోజురోజుకూ విమ‌ర్శ‌ల తీవ్ర‌త పెంచుతున్నారు. కేసీఆర్‌ను నియంత‌గా ఆమె పోల్చారు. అలాగే క‌విత‌పై ష‌ర్మిల చెల‌రేగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెను టీఆర్ఎస్ మంత్రులు , నాయ‌కులు టార్గెట్ చేయ‌డం రాజ‌కీయంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండ‌ల కేంద్రాన్ని మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌, స‌త్య‌వ‌తి రాథోడ్ ప్రారంభించారు. అనంత‌రం ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ కేసీఆర్‌పై చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేస్తే ఉరికించి కొట్టాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. త‌మ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశ‌పూర్వకంగా బ‌ద్నాం చేయ‌డానికే కొంద‌రు అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని మండిప‌డ్డారు.

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ ష‌ర్మిల శిఖండి రాజ‌కీయాలు మానుకోవాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో అల‌జ‌డులు సృష్టించేందుకే ఆమె పాద‌యాత్ర చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మానుకోట రాళ్లను మరిచిపోవద్దని సత్యవతి హెచ్చరించారు. ఎంపీ మాలోత్ క‌విత మాట్లాడుతూ తెలంగాణ‌లో ఎవ‌రైనా స‌హ‌జంగా పాద‌యాత్ర చేసుకోవ‌చ్చ‌న్నారు. కానీ త‌మ నాయ‌కుల‌ను తిడితే ఊరుకునేది లేద‌ని షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు. ష‌ర్మిల‌ రాజ్యం తెలంగాణ‌కు అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. ఆంధ్రకు వెళ్లిపోవాలంటూ షర్మిలను డిమాండ్ చేశారు.

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల హెచ్చ‌రికల నేప‌థ్యంలో ష‌ర్మిల పాద‌యాత్ర‌పై ఉత్కంఠ రేపుతోంది. గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన‌ప్పుడు మానుకోట‌లో టీఆర్ఎస్ శ్రేణులు మానుకోట వ‌ద్ద రాళ్ల దాడికి దిగాయి. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించింది. దాన్ని మ‌రోసారి ష‌ర్మిల‌కు గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. ష‌ర్మిల రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల వ‌ల్ల శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని, కావున అనుమ‌తి ఇవ్వ‌లేమంటూ వ‌రంగ‌ల్ పోలీసు అధికారులు అంటున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ నేత‌లు ష‌ర్మిల‌కు వార్నింగ్ ఇవ్వ‌డాన్ని సాకుగా తీసుకుని పాద‌యాత్ర‌కు పోలీసులు అడ్డంకి సృష్టించొచ్చు. ష‌ర్మిల పాద‌యాత్ర‌ను అడ్డుకేనేందుకే టీఆర్ఎస్ నేత‌లు నోటికి ప‌ని చెబుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.