మొన్నటివరకు చిన్న నిర్మాతలు పండగ చేసుకున్నారు. తమ సినిమాలకు థియేట్రికల్ గా పెద్దగా డబ్బులు రాకపోయినా, ఓటీటీ రూపంలో గిట్టుబాటు అవ్వడంతో ఎగబడి సినిమాలు చేశారు. అయితే ఓటీటీని అన్నివేళలా నమ్ముకోవడం కరెక్ట్ కాదంటూ చాన్నాళ్లుగా ట్రేడ్ పండిట్స్ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడదే జరుగుతోంది.
మొన్నటివరకు ప్రతి సినిమాను ఎగబడి తీసుకున్న ఓటీటీ సంస్థలు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల్ని చాలా చిన్నచూపు చూస్తున్నాయి. ఈమధ్య కాలంలో దాదాపు 50 చిన్న సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు నోచుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అమెజాన్ గట్టి దెబ్బ..
టాలీవుడ్ నిర్మాతల వరకు ఓటీటీ అంటే అమెజాన్ మాత్రమే. ఈ సంస్థ ఒక్కటే కనిపించిన ప్రతి సినిమాను ఎగబడి కొనింది. దీంతో మూడేళ్ల పాటు నిర్మాతలు పండగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ రివర్స్ అయింది. చిన్న సినిమాల్ని కొనడం మానేసింది. ఎంతో హైప్ ఉంటే తప్ప స్ట్రీమింగ్ కు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో చిన్న నిర్మాతలంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఓటీటీలో రేట్లు సవరణలు..
ఒకప్పుడు ప్రతి సినిమాను ఔట్ రేట్ కు దక్కించుకునేది అమెజాన్. ఆ తర్వాత పే పర్ వ్యూ పద్ధతిలోకి మారింది. సబ్ స్క్రైబర్ గంట పాటు సినిమా చూస్తే 4 రూపాయల 50 పైసలు ఇవ్వడం మొదలుపెట్టింది. అదే డబ్బింగ్ సినిమా అయితే రూ.2.50 మాత్రమే. అయినప్పటికీ అమెజాన్ కు ఉన్న భారీ చందాదారుల వల్ల నిర్మాతలకు బాగానే డబ్బు గిట్టుబాటు అయ్యేది. ఆది సాయికుమార్ సినిమాల నిర్మాతలంతా నిన్నమొన్నటివరకు ఇలానే లాభపడ్డారు. ఇప్పుడీ 'పే పర్ వ్యూ' పద్ధతిలో కూడా చిన్న సినిమాలకు స్ట్రీమింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది అమెజాన్.
ఇతర ఓటీటీలది తలోదారి..
తాజాగా డిస్నీ హాట్ స్టార్ కూడా ఇదే బాట పట్టింది. గంటకు ఇంత అనే పద్ధతిలోకి మారింది. కానీ అమెజాన్ లో స్ట్రీమింగ్ పెడితే ఎంత వస్తుందో, అందులో సగం కూడా హాట్ స్టార్ లో సినిమా పెడితే రావడం లేదని నిర్మాతలు బాధపడుతున్నారు. ఇక ఆహా ఓటీటీ సంగతి సరేసరి.
మొన్నటివరకు అమెజాన్ కు పోటీగా సినిమాల్ని పెట్టిన ఈ కంపెనీ, ఆ తర్వాత అమెజాన్ టైపులోనే 'గంటకు 4 రూపాయలు' పద్ధతిలోకి మారింది. ఇప్పుడు ఆ పద్ధతిని కూడా సవరించి, గంటకు 2 రూపాయలు ఇస్తానంటోంది. మరికొన్ని సినిమాలకైతే గంటకు రూపాయిన్నర రేటు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉంది. ఇలా చేస్తే నిర్మాతకు 2 నెలల్లో 5-6 లక్షలు కూడా రావు.
ఇక నెట్ ఫ్లిక్స్, జీ5 సంస్థలు ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరమే. నెట్ ఫ్లిక్స్ లో చాలా తక్కువగా తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఇక జీ5 సంస్థ ఎప్పుడు ఏ సినిమా కొంటుందో, ఎందుకు కొంటుందో దానికే అర్థంకాదు.
దిక్కుతోచని స్థితిలో చిన్న నిర్మాతలు..
చిన్న సినిమాలు థియేటర్లలో ఆడని పరిస్థితి. కంటెంట్ బాగున్నప్పటికీ ప్రేక్షకుడు ఇల్లు కదిలి థియేటర్ కు రావడం లేదు. ఇప్పుడు ఓటీటీలు కూడా చిన్న సినిమాలను దారుణంగా చూస్తున్నాయి. స్ట్రీమింగ్ కు అస్సలు అనుమతి ఇవ్వడం లేదు. అందుకే కొన్ని సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు వాటికి కూడా నోచుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో చిన్న సినిమాల నిర్మాణాలు బాగా తగ్గిపోతాయి.