Gandeevadhari Arjuna Review: మూవీ రివ్యూ: గాండీవధారి అర్జున

చిత్రం: గాండీవధారి అర్జున రేటింగ్: 1.5/5 నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమల రామన్, వినయ్ రాయ్, నరేన్, అభినవ్ గోమఠం తదితరులు సంగీతం: మిక్కీ జె మేయర్ కెమెరా: ముఖేష్…

చిత్రం: గాండీవధారి అర్జున
రేటింగ్: 1.5/5
నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమల రామన్, వినయ్ రాయ్, నరేన్, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
కెమెరా: ముఖేష్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు 
విడుదల: 25 ఆగస్ట్, 2023

ప్రవీణ్ సత్తారు టాలీవుడ్ లో ఒక ప్రామిసింగ్ దర్శకుడు. ఆయన నుంచి వచ్చిన ఈ చిత్రం పట్ల అంచనాలైతే ఏర్పడ్డాయి. దానికి కారణం ప్రధానంగా ట్రైలర్. భారీ ఖర్చుతో పెద్ద యాక్షన్ చిత్రంగా మలచినట్టు అనిపిస్తుంది చూసిన ఎవరికైనా. 

కథలోకి వెళితే ఆదిత్య రాజ్ (నాజర్) కేంద్ర మంత్రి. ఒక మీటింగ్ కోసం బ్రిటన్ వెళతాడు. అక్కడ అతని మీద ఒక ఎటాక్ జరుగుతుంది. ఆ క్రమంలో తన సెక్యూరిటీ చీఫ్‌కి గాయమౌతుంది. అతని ప్లేసులో అర్జున్ (వరుణ్ తేజ్) నియమింపబడతాడు.   

ఆదిత్య రాజ్‌కి రణ్వీర్ (వినయ్ రాయ్) అనే వ్యక్తి నుంచి థ్రెట్ ఉంటుంది. అతను సి.ఎన్.జి అనే కంపెనీ ఓనర్. అతని నుంచి మన హీరో మంత్రిని ఎలా కాపాడతాడు అనేదే కథ. ఇంతకీ ఈ థ్రెట్లన్నీ గార్బేజ్ చుట్టూ తిరుగుతుంటాయి.  

ఈ స్క్రిప్ట్ విషయజ్ఞానం లేక రాసుకున్నదా, లేక ప్రేక్షకులు విషయజ్ఞానం లేనివాళ్లని నమ్మి రాసుకున్నదా అనేది దర్శకుడే చెప్పాలి. ఆయనకి సినిమా యాంబియెన్స్ ని క్రియేట్ చేయడంలో ఉన్న షార్ప్ నెస్ కథాకథనాల్లో లేవని ఋజువు చేసే చిత్రమిది. ఆయన అసెస్మెంట్ తన మునుపటి చిత్రం “ది ఘోష్ట్” లాగానే ఈ సారి కూడా ఎంతెలా తప్పిందో కూడా ప్రేక్షకుల రెస్పాన్స్ ని బట్టి తెలుస్తుంది. 

ఒక రా ఏజెంట్ ఏమిటి… విదేశాల్లో ఒక రష్యన్ కి బాడీ గార్డ్ గా పనిచేయడమేంటి… ఆ రష్యన్ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన కారణం చేత ప్రత్యర్థులు ఎటాక్ చేస్తే అతనిని కాపాడే వృత్తి ధర్మం నిర్వర్తించి సాయుధులైన అతని మనుషుల ముందే అతనిని చాచి కొట్టి.. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే నీలాంటి వాడి దగ్గర పని చెయ్యనని వెళ్లిపోవడమేమిటి!

మరో పక్క ఇండియాలోని కొండప్రాంతాల్లో విచిత్రమైన జబ్బులు సోకి జనం పోతుంటే దానికి కారణం ఈ సోషల్ మీడియా యుగంలో కేవలం ఒక మినిష్టర్ కి, ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్ కి తప్ప ఎవ్వరికీ తెలియకపోవడమేమిటి? ఆ రహస్యాన్ని విదేశాల్లో నానా దేశాల అధినేతల మధ్య యూ.ఎన్.ఓ మీటింగులోనే బయటపెట్టాలని మినిస్టర్ గారు ఆగడమేమిటి?

ఇదంతా ఒకెత్తైతే యు.ఎన్.ఓ మీటింగ్ టైములో ఎక్కడో దూరంగా బిల్డింగ్ పై నుంచి గదిలో మాట్లాడుతున్న మినిస్టర్ తల మీద షార్ప్ షూటర్ గురిపెట్టడమేంటి?

తెర మీద అలాంటి సన్నివేశాలు కదులుతున్న క్రమంలో ఇలాంటి “ఏమిటి”లు సినిమా చూస్తున్నంతసేపూ అడుగడుగునా పుడుతూనే ఉంటాయి. 

అసలు ఈ సినిమాని ఏం చెప్పాలని ఏం తీసారో అనిపిస్తుంది. సినిమా మొత్తం “గార్బేజ్” నేపథ్యంలో సాగుతుంది. 

ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అటుంచి తక్కిన విషయానికొస్తే అసలు ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఫ్రెష్ గా అనిపించదు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునే విలన్, కిడ్నాపు చేయడం, రొటీన్ క్లైమాక్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. 

ఇక హీరోయిన్‌కి ఒక తెల్లజాతీయుడికి మధ్యన జరిగే ఒక సీనైతే మరీ విడ్డూరంగా ఉంటుంది. చాలా సేపు హీరోయిన్ అతనిని వెంబడించిన తర్వాత, అతను సడెన్‌గా ట్రైనెక్కడం, వెనువెంటనే ఈమె కూడా ఎక్కడం, పక్కనే కూర్చుని పెన్ డ్రైవ్ ఇవ్వడం… అంతా ఏమీ లేని హడావిడిలా అనిపిస్తుంది. 

అలాగే హీరో తల్లి అంత్యక్రియల సీన్ కూడా క్లూలెస్ గా సాగుతుంటుంది. బరియల్ గ్రౌండ్ లో బ్రిటీష్ పోలీసులు అయోమయపడుతూ పరుగెడుతుంటారు. 

సినిమా మొదలవ్వగానే వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టెన్షన్ నిండిన వాతావరణం చూసి ఇదేదో చివరి వరకు ఉత్కంఠభరితంగా కూర్చోబెట్టే సినిమాలా ఉందే అనిపిస్తుంది. కానీ 45 నిమిషాలైనా ఉరుములే తప్ప వాన కురవని విధంగా సాగుతున్న కథనంలో అసలు ప్లాట్ పాయింటేంటో అర్ధం కాక ప్రేక్షకులు “అర్జునా ఫల్గుణా..” అంటూ మనసులోనే జపం చేస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. 

వరుణ్ తేజ్ లుక్, పర్సనాలిటీ పర్ఫెక్ట్. అడివి శేష్ తో పాటూ మరొక పర్ఫెక్ట్ సినీ రా ఏజెంట్ దొరికాడనిపిస్తుంది. బహుశా ఇలా తన క్యారెక్టర్ ఫలానా అనగానే ఎక్జైట్ అయిపోయి ఒప్పేసుకున్నాడేమో. కథలో బేసిక్ డెప్త్ కూడా లేకపోవడం, ఒక సీరియస్ పాయింటుని సిల్లీగా ప్రపంచమంతా తిప్పడం అనేవి ఇతనికి ఈ స్క్రిప్టులో ఎందుకు కనిపించలేదో పాపం!

హీరోయిన్ గా సాక్షి వైద్య చాలా బాగుంది. మంచి ఫోటోజెనిక్ ఫేస్. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. 

విలన్ గా వినయ్ రాయ్ స్క్రీన్ ప్రెజెన్స్, బిల్డప్ సెన్స్ బాగున్నాయి. కానీ వందలాది సినిమాల్లో కనిపించే రొటీన్ రొట్టకొట్టుడు క్యారెక్టరైజేషన్ ఇది. 

విమల రామన్, నాజర్ ఓకే. మధ్యలో నాన్ సింక్ లా వచ్చి, పోయే పాత్ర అభినవ్ గోమఠం. కామెడీ కంటే ఇర్రిటేషన్ ఎక్కువ తెప్పించిన క్యారెక్టర్ ఇది. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులేయొచ్చు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండి ఉన్నంతలో ప్రేక్షకుల్ని కాపాడే ప్రయత్నం చేసినా బేసిక్ కథాకథనాల్లోనే ఆసక్తికరమైన అంశం లేకపోవడం వల్ల లెంగ్దీ సినిమా చూసిన ఫీలింగొస్తుంది. 

అసలీ కథని, కథనాన్ని ఏలా చెబితే నిర్మాత ఓకే చేసారో అనేది కూడా పెద్ద కేస్ స్టడీయే. వరుణ్ తేజ్ అయినా ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఔత్సాహిక కథా రచయితలకు కూడా కలుగుతుంది. ఈ సినిమా గురించి చాలా కాంఫిడెంట్ గా చెప్పి ప్రేక్షకుల అంచనాల్ని అనవసరంగా పెంచారు. చూస్తే గానీ తెలీదు.. ఈ చిత్రం “చెవిలో క్యాబేజి-తెర మీద గార్బేజి” అని ఉపశీర్షిక పెట్టుకునేలా ఉందని. 

ఇంతకీ ఈ సినిమాలో సమస్య చెప్పి సొల్యూషన్ పూర్తిగా చెప్పలేకపోయారు. తీయాలనుకుంటే ఆ సొల్యూషన్ చూపిస్తూ దీనికి సీక్వెల్ కూడా తీయొచ్చు. భూమి మీద పేరుకుపోతున్న చెత్తని భూమి మీద కాకుండా ఏ చంద్రయాన్ రాకెట్టో ఎక్కించి చంద్రమండలంలో పారేసేలా చూపించి భావి తరాలకి గొప్ప మార్గం చూపించొచ్చు. ఇంకా బడ్జెట్టుంటే కాస్త దూరం వెళ్లి మార్స్ మీద కూడా పారేసి రావొచ్చు. 

బాటం లైన్: “చెత్త” సందేశం!