జగన్ ను ఎవరైనా పొడిగారంటే దానికి కవరేజ్ ఇచ్చేది లేదు. జగన్ ను ఎవరైనా అక్కసు కొద్ది విమర్శిస్తే ఆ కథనాలను పతాక శీర్షికలకు ఎక్కించడం.. కొన్ని పత్రికలకు అలవాటే. ఆ క్రమంలో 'ఈనాడు' ఇప్పటి వరకూ ఎంతో చేసింది. విశేషం ఏమిటంటే.. ఆ బ్యాచ్ మీడియా ఇప్పుడు కూడా అదే పనే చేస్తోంది.
ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయాన్ని అయితే ప్లే చేశారో.. అదే రాజకీయమే ఇప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మీద ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ చేసిన కామెంట్లను కూడా ఫస్ట్ పేజీల్లో, వెబ్ సైట్ హోం పేజ్లో పతాక శీర్షికల్లో పెట్టి ఆనందించిన ఆ మీడియా సంస్థ ఇప్పుడు కూడా అదే రాజకీయమే చేస్తోంది.
ఈనాడులో పని చేసిన సీనియర్ జర్నలిస్టులు కొందరు చెబుతూ ఉంటారు.. ఆ పత్రిక ఏం చేసినా ఒక కొలత ఉంటుందని వారు గర్వంగా చెప్పేవారు. అయితే కేఈ పాల్ వంటి వారి కామెంట్లను పతాక శీర్షికల్లోకి ఎక్కించినప్పుడు అలాంటి వారి గర్వం ఏమయ్యిందో మరి. 'జగన్ జైలుకు వెళతారు..' అంటూ కేఏ పాల్ చేసిన వ్యాఖ్యను చాలా సార్లు మొదటి పేజీల్లో పెట్టుకుని ఆనందించారు.
ఇక ఇప్పుడు కథ ఏమిటంటే.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎంగా జగన్ పాలన గురించి తన విశ్లేషణను అందించారు. అయన చాలా విశ్లేషణాత్మకంగా…ప్లస్ లు ఏమిటో, మైనస్ లు ఏమిటో చెప్పారు. అయితే ఉషోదయం పత్రిక మాత్రం.. జగన్ పాలనలో ఉండవల్లి ఎత్తి చూపిన మైనస్ లను మాత్రమే చెప్పింది. ఆయన ప్రస్తావించిన ప్లస్ లను ఎగ్గొట్టి, మైనస్ లను మాత్రం ఎత్తి చూపిందని.. అదీ 'ఈనాడు' శైలి అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నవ్విపోదురుగాక!