మోడీకి కౌంటర్.. మంచి పాయింట్ పట్టిన రాహుల్!

విదేశానికి వెళ్లినప్పుడు మన పాలకులు నడుచుకునే విషయంలో మనకంటూ ఒక విదేశాంగ విధానం ఉంటుంది. మరో దేశానికి వెళ్లి అక్కడ పాలానా పార్టీ గెలవాలనో, ఫలానా నేత చేతికి పవర్ అందించాలని పిలుపునివ్వడమో మన…

విదేశానికి వెళ్లినప్పుడు మన పాలకులు నడుచుకునే విషయంలో మనకంటూ ఒక విదేశాంగ విధానం ఉంటుంది. మరో దేశానికి వెళ్లి అక్కడ పాలానా పార్టీ గెలవాలనో, ఫలానా నేత చేతికి పవర్ అందించాలని పిలుపునివ్వడమో మన విధానం కాదు. అది విధానపరంగానే కాదు..ఏరకంగానూ ఇండియాకు లాభం చేకూర్చే పని కాదు. అయితే అత్యుత్సాహపు నరేంద్రమోడీ అమెరికాకు వెళ్లి మరోసారి ట్రంప్  గెలవాలని పిలుపునిచ్చారు.

వేరే పాలకుడు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే.. అది తీవ్ర దుమారం రేపేది. అయితే మాట్లాడింది మోడీ కావడంతో.. ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అమెరికాలో ట్రంప్ మళ్లీ గెలవాలంటూ భారత ప్రధాని హోదాలోని మోడీ కోరాటం ఎంత వరకూ సమంజసమో ప్రజలే ఆలోచించుకోవాలి.

అందునా ట్రంప్ ఏమీ భారత్ పట్ల సానుకూలంగానూ వ్యవహరించడం లేదు. ట్రంప్ వచ్చాకా అమెరికాలోని భారతీయుల పరిస్థితి ఏమయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చదువుల కోసమంటూ అక్కడకు వెళ్లిన వారు కూడా తట్టాబుట్టా సర్దుకుని ఎంత మంది తిరిగి వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఎరుకలో కూడా అలాంటి వారు కొందరైనా కనిపిస్తారు. ట్రంప్ విధానాలతో ఇబ్బందులు పడుతున్న వారిలో భారతీయులు కూడా ముందున్నారు. అలాంటి ట్రంప్ నెగ్గాలని మోడీ పిలుపునిచ్చారు!

అయితే ఇలాంటి సందర్భంలో మోడీ భక్తగణం ట్రంప్ ను కూడా గట్టిగా సమర్థించగలరు. ఎందుకంటే..ట్రంప్ ను మోడీ పొగిడారు కాబట్టి, ట్రంప్ గొప్పవాడంతే! ఈ థియరీలే ఇప్పుడు దేశాన్ని నడుపుతున్నది. ఈ విషయంలో రాహుల్ గాంధీ స్పందించారు. మోడీ తీరును ప్రశ్నించారు. రేపు ట్రంప్ కాకుండా మరొకరు ఎవరో నెగ్గారని అనుకుందాం.. ఇక్కడ పాలకుడిగా మోడీనే ఉంటారు. అప్పుడు సదరు అమెరికన్ పాలకులు ఇండియా పట్ల కక్ష పూర్వకంగా వ్యవహరిస్తే? అప్పుడు మోడీ ఏం చేస్తారు? అయినా పరాయి దేశంలో ఎవరో నెగ్గాలని, ఎవరో ఓడాలని కోరుకోవడం ఏమిటి? 

అదే ఇండియా విషయంలో పరాయి దేశాలు అలాంటి కామెంట్ ను చేస్తే..ఇక్కడి వీర మోడిత్వవాదులు ఒప్పుకుంటారా? ఏ బ్రిటన్ ప్రధానో.. మరో ఫ్రాన్స్ ప్రెసిడంటో.. ఇండియాలో కాంగ్రెస్ నెగ్గాలనో  పిలుపునిచ్చారనుకోండి..అప్పుడు మోడిత్వవాదుల స్పందన ఎలా ఉంటుందో!