మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి ఆదిత్యఠాక్రే పోటీకి దిగుతున్నారు. విశేషం ఏమిటంటే.. ఠాక్రేల వంశం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనది కీలక పాత్రే. ఆ పార్టీ అధినాయకత్వంగా ఠాక్రేలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నారు. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేసింది, కీలకమైన పదవులు చేపట్టింది లేదు.
కేవలం పార్టీ మీద అజామాయిషీ చేస్తూ వారు కర్రపెత్తనం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి నేఫథ్యంలో తొలిసారి బాల్ ఠాక్రే మనవడు, ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యఠాక్రే ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఠాక్రేలు చాలా కాలంగా ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వారికి అవకాశం దక్కడం లేదు.
అవకాశం దక్కుతుందనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీనే అడ్డుపడింది. అలక వహించడం, బీజేపీకే సపోర్ట్ చేయడం మినహా ఠాక్రేలు మరేం చేయలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఆదిత్యఠాక్రే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వర్లీ నుంచి బరిలోకి దిగాడు. గెలవడం కష్టం కాకపోవచ్చు. గెలిస్తే ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవినే శివసేన గట్టిగా డిమాండ్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇక తన గురించి తను చెబుతూ.. రాజకీయాలకు తప్ప తను మరెందుకూ పనికిరానని ఎప్పుడో ఫిక్సయినట్టుగా ఆదిత్య ఠాక్రే చెప్పుకొచ్చారు.