క‌విత ఏ మొహం పెట్టుకుని…!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో కేసీఆర్ ముద్దుల త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు వుండ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధం దొరికిన‌ట్టైంది. మ‌రీ ముఖ్యంగా క‌విత‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. త‌ద్వారా మీడియాలో…

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో కేసీఆర్ ముద్దుల త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు వుండ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధం దొరికిన‌ట్టైంది. మ‌రీ ముఖ్యంగా క‌విత‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. త‌ద్వారా మీడియాలో భారీ ప్ర‌చారానికి నోచుకుంటున్నారు. త‌న పాద‌యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన నేప‌థ్యంలో ఆమె ఇవాళ మీడియా ముందుకొచ్చారు.

తెలంగాణ‌లో నియంత పాల‌న సాగుతోంద‌న్నారు. కేసీఆర్ ఓ నియంత అన్నారు. బాధితురాలినైన తన‌ను క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం ఏంట‌ని ఆమె నిల‌దీశారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతున్నందుకే దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ నేత‌లు త‌మ గొయ్యి తామే త‌వ్వుకుంటున్నార‌న్నారు. త‌న పాద‌యాత్ర‌తో కేసీఆర్‌లో వ‌ణుకు పుడుతోందన్నారు. అధికారం త‌ల‌కెక్కితే విప‌రీత బుద్ధులు పుడుతాయంటే ఇదే అని అన్నారు.

 త‌న పాద‌యాత్ర‌కు అనుమ‌తిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్‌ను పోలీసులు ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని ష‌ర్మిల నిల‌దీశారు. శాంతిభ‌ద్ర‌త‌ల పేరుతో పాద‌యాత్ర‌ను అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. త‌న పాద‌యాత్ర‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌స్తోంద న్నారు. త‌న‌కు షర్మిల ప్ర‌త్యామ్నాయం అని కేసీఆర్‌కు అర్థ‌మైంద‌న్నారు. తానంటే కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌న్నారు.  బండి సంజ‌య్ పాత్ర స‌జావుగా సాగుతోంద‌ని ఆమె గుర్తు చేశారు. త‌న‌నే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

త‌న‌ను బెదిరింపు ధోర‌ణిలో టీఆర్ఎస్ నేత‌లు మాట్లాడార‌ని, అది తాలిబ‌న్ల భాష కాదా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. తాలిబన్ల భాష మాట్లాడ్డం వ‌ల్లే తాలిబ‌న్ల రాష్ట్ర స‌మితి అంటున్న‌ట్టు ష‌ర్మిల ఘాటు వ్యాఖ్య చేశారు. ఒక మ‌హిళ పాద‌యాత్ర చేస్తుంటే, అధికార పార్టీకి క‌నీస బాధ్య‌త లేకుండా ఎలా పోతుంద‌ని ఆమె నిల‌దీశారు. 

క‌విత ఏ మొహం పెట్టుకుని స‌మాజంలోకి వ‌స్తుంద‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఒక మ‌హిళ లిక్క‌ర్ స్కామ్‌లో ఉండ‌డం ఏంట‌ని ఆమె నిల‌దీశారు. ఆమె త‌ల ఎక్క‌డ పెట్టుకుంటుంద‌ని ష‌ర్మిల గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. వాళ్ల‌కు అస‌లు సిగ్గేలేద‌న్నారు. మ‌హిళ‌లు కూడా లిక్క‌ర్ స్కామ్‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.