జనసేన అధిపతి పవన్‌కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు దిమ్మతిరిగే సెటైర్ వేశారు. నిన్న విద్యార్థులనుద్దేశించి పవన్ ప్రసంగిస్తూ తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌గా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓటమి అనేది విజయానికి సగం పునాది అని, భవిష్యత్‌లో విజయం సాధిస్తానని ఆయన నోటికొచ్చినట్టు చెప్పుకొచ్చారు.
పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్‌లో విసుర్లు విసిరారు. రాజకీయంగా పవన్‌కు భవిష్యత్తే లేదని అంబటి జోష్యం చెప్పడం గమనార్హం. అయితే సినిమాల్లో మాత్రం పవన్‌ను సక్సెస్ ఫుల్ హీరోగా కితాబిచ్చారు. నిన్న, నేడు, రేపు ఇలా పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ పొలిటీషియనే అని అంబటి రాంబాబు అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా ఆయన ఏమన్నారంటే… పవన్ సక్సెస్ ఫుల్ యాక్టర్ .. ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని పంచ్ వేశారు. అంబటి వ్యంగ్యంగా అన్నప్పటికీ, అందులో నిజం లేకపోలేదు. పవన్ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎప్పుడూ గెలవకపోవడాన్ని ఆయన గుర్తు చేయడం గమనార్హం. రాజకీయ నాయకుడిగా తన పాత్రను సరిగా పోషించకపోవడం వల్లే విజయం సాధించలేకపోతున్నట్టు రాంబాబు చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కు సిద్ధాంతపురమైన విధానం లేదని అంబటి విమర్శించారు. ఇందుకు కారణాలను కూడా అంబటి వివరించారు. జనసేన ప్రారంభించే సమయంలో పవన్ పదేపదే తన ప్రసంగంలో ప్రపంచ విప్లవ నాయకు నాయకుడు చేగువేరా గురించి స్మరించారు. ఆ తర్వాత ఆయన భావజాలానికి పూర్తి భిన్నమైన బీజేపీ పంచన చేరడాన్ని అంబటి వివరించారు. అందుకే పవన్ రాజకీయంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారని అంబటి విమర్శించారు.