ప్రజల్ని ముందుండి నడిపించేవాడే అసలైన నాయకుడు. సమస్యలొచ్చినప్పుడు తాను పారిపోయి, ప్రజల్ని వాటితో పోరాటం చేయాలని చెప్పేవారిని నాయకుడనరు, చంద్రబాబు అంటారు. కరోనా వైరస్ వ్యాప్తి తొలి దశలో ఉండగానే ఫ్యామిలీతో సహా హైదరాబాద్ పారిపోయి.. అద్దాల మేడలో జూమ్ ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్న చంద్రబాబుకి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడే హక్కు ఎంతమాత్రం లేదు. అయితే చీటికీమాటికీ కరోనా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తాను ముందే హెచ్చరించానంటూ బీరాలు పలకడం మాత్రం బాబుకి అలవాటైపోయింది.
తాజాగా డాక్టర్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడి మరింత కామెడీ చేశారు చంద్రబాబు. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనాతో చనిపోయిన తర్వాత బంధువులు దగ్గరకు రాకపోవడం, వైరస్ సోకినవారిని ఊళ్లలో ఉండనీయకపోవడం, మృతదేహాలను జేసీబీలలో తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడం.. ఇవేవీ బాబుకి నచ్చలేదట. దీనిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన తేవాలని, ఏపీలో అలా జరగడంలేదని విమర్శించారు చంద్రబాబు.
కరోనాపై ప్రజల్లో భయాందోళనలు ఉన్నమాట వాస్తవం, సోషల్ మీడియా పుణ్యమా అని ఈ భయాలు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి కానీ, వాస్తవాలు ఎవరూ గ్రహించడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎంత మొత్తుకున్నా ఆ భయం పోదు, ఆందోళన తగ్గదు. ఇలాంటి టైమ్ లో వీలైతే నాలుగు మాటలు చెప్పి ప్రజల్లో ధైర్యం నింపాలి. అంతే తప్ప, జూమ్ ఉంది కదా అని విమర్శలు చేస్తూ కూర్చోవడం తగదు. మరీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రం పారిపోయిన చంద్రబాబులాంటి వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరీ సిగ్గుచేటు.
ప్రజలకు ధైర్యం చెప్పడానికే కరోనాతో సహజీవనం చేయాలని, కరోనా వస్తే పారాసెట్మాల్ సరిపోతుందని సీఎం జగన్ చెప్పారు. అప్పుడు దాన్ని వెటకారం చేసిన బాబుకి, ఇప్పుడు విమర్శించే హక్కు ఎక్కడిది? పొరపాటున జగన్ ముందుగానే మృతదేహాల వల్ల కరోనా రాదని చెబితే.. దాన్ని కూడా టీడీపీ విమర్శించేదే కదా?
తాను మాత్రమే మేధావిని అనుకునే చంద్రబాబు కరోనా విషయంలో అన్నీ తాను అనుకున్నట్టే జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. గ్లోబర్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్ ద్వారా ప్రతి వారం కేంద్రానికి ఆయన నివేదిక పంపిస్తున్నారట. ఇంకా నివేదికలు, గ్రాఫిక్స్ అంటూ భ్రమల్లోనే బ్రతుకుతున్న చంద్రబాబుకి కరోనా కష్టకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా కనిపిస్తాయి. ఇంతకీ ప్రజల్లో అవగాహన తేవడానికి, ధైర్యం నింపడానికి ప్రతిపక్షంగా టీడీపీ ఏం చేసిందో కాస్త చెబుతావా బాబూ..?