ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు పోలీస్ కస్టడీ తప్పలేదు. ఆర్యన్ తరఫు లాయర్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబయి స్థానిక కోర్టు తిరస్కరించింది. గురువారం వరకు ఆర్యన్ ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్సీబీ వాదన ఇది..
ఈ కేసును ఎన్సీబీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. డ్రగ్స్ మూలాలు మొత్తం ఆర్యన్ ఖాన్ చుట్టూనే తిరుగుతున్నాయని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఆర్యన్ పర్సు, అండర్ వేర్ లో డ్రగ్స్ కనుగొన్నామని వాదించింది ఎన్సీబీ. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకుల గురించి తెలియాలంటే, ఆర్యన్ ను విచారించి తీరాల్సిందేనని ఎన్సీబీ తరఫు న్యాయవాది గట్టిగా వాదించారు.
ఆర్యన్ మొబైల్ ఫోన్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, అందులో చాలా కోడ్ వర్డ్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపిన ఎన్సీబీ తరఫు న్యాయవాది.. ఆ కోడ్ భాషకు అర్థం తెలియాలంటే ఆర్యన్ ను పోలీస్ కస్టడీకి అప్పగించాలన్నారు. దీంతో పాటు ఆర్యన్ బ్యాంక్ ఖాతాల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని.. భారీ మొత్తంలో ఎవరెవరికి ఆర్యన్ డబ్బులు పంపించాడనే విషయంపై ఆరా తీస్తే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడతాయని వాదించారు.
ఆర్యన్ తరఫు లాయర్ వాదన ఇది..
ఆర్యన్ తరఫు లాయర్ సతీష్ మాన్ షిండే తన అనుభవం మొత్తం రంగరించి ఈ కేసును బలంగా వాదించాడు. ఆర్యన్ కేవలం క్రూయిజ్ షిప్ లోకి ప్రత్యేక ఆహ్వానితుడిగా (సెలబ్రిటీ గెస్ట్) మాత్రమే వెళ్లారని.. అక్కడ జరిగిన రేవ్ పార్టీ (డ్రగ్స్ వాడిన పార్టీ)కి ఆర్యన్ కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు.
ఆర్యన్ బ్యాగులో 6 గ్రాముల అతి తక్కువ తీవ్రత కలిగిన మాదక ద్రవ్యాలు మాత్రమే ఉన్నాయన్న మాన్ షిండే.. అరెస్ట్ సమయంలో తన క్లయింట్ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వాదించారు. ఇతర నిందితుల వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకొని, ఆర్యన్ ను అరెస్ట్ చేయడంలో అర్థం లేదన్నారు.
సతీష్ మాన్ షిండే వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆర్యన్ తో పాటు అతడి ఇద్దరి స్నేహితుల్ని గురువారం వరకు రిమాండ్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది. క్రూయిజ్ షిప్ లో జరిపిన దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల ఛెరాస్, ఎండీఎంఏ మాత్రలు 22, ఎండీ టాబ్లెట్స్ 5 గ్రాములు దొరికాయంటూ ఎన్సీబీ ఇచ్చిన నివేదికను కోర్టు సీరియస్ గా తీసుకుంది.
ఆర్యన్ అలా బతికిపోయాడు..
ఈ మొత్తం వ్యవహారంలో ఓ విషయంలో మాత్రం ఆర్యన్ ను అదృష్టవంతుడిగా చెప్పుకోవాలి. అతడి మొబైల్ లో చాలా వాట్సాప్ మెసేజీలు డిలీట్ అయ్యాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆర్యన్ డిలీట్ చేశాడా లేక పట్టుబడిన తర్వాత ఎవరైనా వాటిని డిలీట్ చేశారా అనేది వివాదాస్పదమైంది.
ఆ వాట్సాప్ మెసేజీల్ని రికవర్ చేయడం చాలా కష్టం అంటున్నారు అధికారులు. అయితే అలా డిలీట్ అయిన మెసేజులు కాకుండా, మరికొన్ని ఛాటింగ్స్ లో కోడ్ వర్డ్స్ ను అధికారులు కనిబెట్టారు. వాటిపై రేపట్నుంచి విచారణ సాగించనున్నారు.
మరోవైపు బెయిల్ రాకపోవడంతో 23 ఏళ్ల ఆర్యన్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై షారూక్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం అతడు తన షూటింగ్స్ అన్నీ రద్దు చేసుకున్నాడు.