ఈ నెలలో పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు అనౌన్స్ అవుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఓ సినిమా ప్రకటన వచ్చింది. డివివి దానయ్య-సుజిత్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చింది. ఇక మైత్రీ మూవీస్-హరీష్ శంకర్ సినిమా ప్రకటన రావాల్సి వుంది. చిత్రమైన సంగతి ఏమిటంటే ఈ రెండు సినిమాల వెనుక మంచికో, చెడుకో ఒక వ్యక్తి వున్నారన్నది. ఆయన ఎవరో కాదు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ జమానా కాలంలో మైత్రీ మూవీస్ దగ్గర, డివివి దానయ్య దగ్గర అడ్వాన్స్ లు తీసుకున్నారు. కానీ ఆ తరువాత తన సినిమాలను హారిక హాసిని మాత్రమే పరిమతం చేసారు. దాంతో మైత్రీ సంస్థ కిందా మీదా పెట్టి మరీ త్రివిక్రమ్ దగ్గర నుంచి వడ్డీ తో సహా అడ్వాన్స్ వసూలు చేసుకుంది. దానయ్య మాత్రం అలాగే వుంచారు. ఎప్పటికైనా తనకు సినిమా చేయాలి అన్నది ఆయన డిమాండ్.
మైత్రీ-హరీష్ శంకర్ సినిమా ఎంతకూ పట్టాలు ఎక్కకపోవడానికి కారణం త్రివిక్రమే అని గుసగుసలు వున్నాయి. తన పాత కోపంతో, పవన్ దగ్గర తనకు వున్న మాట పలుకుబడి ఉపయోగించి ఆ సినిమాను అలా అలా వెనక్కు నెడుతున్నారని గుసగుసలు వున్నాయి.
ఇదిలావుంటే దానయ్య-సుజిత్-పవన్ కళ్యాణ్ సినిమా సెట్ అయింది. దీని వెనుక సూత్రధారి త్రివిక్రమ్ నే అని టాక్. ఆయనే దగ్గర కూర్చో పెట్టుకుని సుజిత్ చేత కథ తయారు చేయించారని వినిపిస్తోంది. ఆ విధంగా పవన్ తో సినిమా సెట్ చేయించినందుకు ప్రతిఫలంగా డివివి దానయ్య అడ్వాన్స్ చెల్లుబాటు అయిపోయిందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.
అంటే ఓ అడ్వాన్స్ కారణంగా సినిమా ఆలస్యం అయితే, మరో అడ్వాన్స్ కారణంగా సినిమా త్వరగా చేతిలోకి వచ్చిందంటూ టాలీవుడ్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. నిజానిజాలు అపూర్వ స్నేహితులు త్రివిక్రమ్-పవన్ కే తెలియాలి.