Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఆ‘పాత’ పలుకు

ఆ‘పాత’ పలుకు

ప్రతివారం వండి వార్చాలంటే కొత్త పలుకులు ఎక్కడి నుంచి పలుకుతాయి. ఆవు. వ్యాసం తప్ప మరొకటి రాని వాళ్లకి ఎక్కడి నుంచి అయినా అక్కడికే వెళ్లడం తప్ప మరో దారి వుంటుందా? వారం వారం వైఎస్ జ‌గన్ మీద అక్కసు వెళ్లగక్కాలి అంటే కోడి కత్తి కేసు దగ్గర నుంచి మొదలెట్టాల్సిందే. రాసిందే రాయరా..రాధా కృష్ణ సోదరా అన్నట్లు తయారవుతోంది నానాటికీ ‘కొత్త పలుకు’. పేరులో తప్ప మరెక్కడా కొత్త పాయింట్ భూతద్దం పెట్టి వెదికినా కనిపించదు. అలాంటి పలుకు మరోసారి ఈ వారం పలికింది.

ఎప్పటి లాగే జ‌గన్ ఉగ్గుపాల నుంచి సిఎమ్ అయ్యే వరకు జ‌రిగిన సంఘటనలను ఏకరవు పెట్డడం తప్ప మరేమీ కొత్తదనం కనిపించలేదు. రాసిందే రాయడానికి ఆయనకు విసుపు లేకపోవచ్చు లేదా రాయగా రాయగా కొంతమందిని అయినా నమ్మించవచ్చు అనే ఆలోచన వుండి వుండొచ్చు.

కానీ ఈ పలుకు పలికే వారు అయినా ఇలాంటి పలుకులు పదే పదే పలికేవారు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఙనం వీటిని పట్టించుకోవడం ఏనాడో మానేసారు అన్నది. జ‌గన్ కోడి కత్తి సంగతి ఇప్పుడు జ‌నాలకు గుర్తు చేసి ప్రయోజ‌నం ఏమిటి? ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నేర మొదపని, పోరాటానికి కాలు కదపని చంద్రబాబు వైనాన్ని ఒక్కసారి అయినా ఎత్తి చూపిన దాఖలా వుందా అంటే అదీ లేదు. ఎప్పుడయితే చంద్రబాబును వదిలేసి జ‌గన్ ను మాత్రమే సాధిస్తూ పోతున్నారో అప్పుడు ఆ పలుకులకు విలువ ఎక్కడ వుంటుంది. భాజ‌పాను ఢీకొని, ఆ పార్టీని శతృవును చేసుకుని, జ‌గన్ తన పీకల మీదకు తెచ్చుకోవాలన్నది ఈ పలుకుల ఆంతర్యం అన్న సంగతి తెలియనిది ఎవరికి? ఆ విధంగా జ‌గన్ ను ఎగసం దోసి, రెచ్చ గొట్టి భాజ‌పాకు దూరం చేయాలి అలా కాని పక్షంలో జ‌నాల్లో బదనామ్ చేయాలన్న ఎత్తుగడ జ‌నాలకు ఏనాడో అర్థం అయిపోయింది.

ఎన్టీఆర్ ఏమిటి? చంద్రబాబు సంగతేమిటి? జ‌గన్ వైనమేమిటి? అన్నది తెలియని తెలుగు జ‌నం లేరు ఈనాడు. జ‌నం తెలివి మీరారు కాబట్టే, ఎంత గోలగోల చేసినా, పేజీలకు పేజీలు ఖర్చు చేసినా, రెండు సార్లు వైఎస్ విజ‌యాన్ని ఆపలేకపోయారు. జ‌గన్ ఒక్కచాన్స్ ఇవ్వమని అడిగారని జ‌నం ఇచ్చారు అంటున్నారు. అదే సమయంలో జ‌గన్ కు మీరు చాన్స్ ఇవ్వవద్దు అని అప్పట్లో ఈ మీడియాలు అన్నీ కట్టగట్టి గోల చేసి వదిలాయి. అయినా జ‌నం పట్టించుకున్నారా? అంటే ఈ మీడియాలకు జ‌నంలో వున్న విశ్వసనీయత ఈనాడు కాదు ఏనాడో పలుచనైపోయిందన్న సంగతి గమనించుకోవడం లేదు. అలా గమనించకే పాడిన పాటే వారం వారం పాడుతున్నారు. అలాంటి పాటే ఈ వారం మరోసారి పాడేసారు.

సరే, ఈవారం వండివార్చిన కొత్తపలుకులో కొత్త పాయింట్ లేదా అంటే…వుంది. ఒకే ఒక్కటే చిత్రమైన పాయింట్. టీఆర్ఎస్ అధినేత ముద్దుల తనయ కవిత పాపం, కేవలం విజ‌యసాయి రెడ్డి కుటుంబం సావాస దోషం వల్ల మద్యంకేసులో ఇరుక్కుపోయారట. ఎంత గొప్ప పలుకు? విజ‌యసాయి తో సంబంధం లేకుండా అరంబిందో సంస్థ తెలంగాణలో టీఆర్ఎస్ తో సత్సంబంధాలు కలిగి వున్న సంగతి తెలియనిదా? హైదరాబాద్ లో కేసిఆర్ అండదండలు లేకుండానే అరబిందో అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టగలిగిందా?  కవిత ఇన్ వాల్వ్ అయ్యారని అంటున్న లిక్కర్ కేసులో అరవిందో వాళ్లు ఇన్వాల్వ్ అయ్యారా? లేదా అరవిందో వాశ్లు వేళ్లు పెట్టిన మద్యం కేసులో కవిత కాళ్లు పెట్టారా? అన్నది జ‌నాలకు తెలియని సంగతా?  

కానీ ఇక్కడ పలికిన పలుకు వేరు. జ‌గన్ అండ్ కో వల్లనే కవిత అమాయకంగా ఇరుక్కుపోయారని నమ్మించే ప్రయత్నం. సరే ఈ సంగతి అలా వుంచితే… సాధారణంగా జ‌ర్నలిజం కోణంలో రాసే వ్యాసాల్లో పాయింట్ బేస్డ్ గా డిస్కషన్ వుంటుంది.  అలా కాకుండా ఆక్రోశం చోటు చేసుకోవడం అన్నది ఈ పలుకుల్లోనే కనిపిస్తుంది.

తెలంగాణలో భాజ‌పా ఇలా చేస్తోంది. ఆంధ్రలో మాత్రం అలా చేయడం లేదు. అనే ఆక్రోశం పలుకు పలుకునా తొంగి చూసింది. ఇవి చదవుతుంటే జ‌నాలకు అవగాహన కలగడం మాట అటుంచి నవ్వుకునేలా వుంది. జ‌గన్ ఇలా అయిపోను..జ‌గన్ అలా అయిపోతే బాగుండును అని శాపనార్థాలు పెట్టినట్లు అనిపిస్తోంది తప్ప మరేం కాదు. మన వల్ల మరేమీ కాదు..మనం ఏమీ చేయలేము..అన్న నిస్సహాయత ఆవరించినపుడే ఇలాంటి శాపనార్థాలు వస్తాయి,,ఆక్రోశాలు వినిపిస్తాయి.

సరైన పాయింట్ వుంటే జ‌నానికి మరీ ఎక్కువగా చెవిన ఇల్లు కట్టుకుని పదే పదే చెప్పనక్కరలేదు. ఇట్లే తెలిసిపోతుంది. అదే విషయం లేనపుడు ఒకటికి పదిసార్లు పదే పదే అదే పలుకులు పలికినా ఫలితమూ లేదు. ఎందుకంటే జ‌నాలకు అదీ బాగానే అర్థమైపోతుంది. ఇది అధికారం దూరమైపోయినందున కలిగిన ఆక్రోశం తప్ప వేరు కాదని ఫుల్ క్లారిటీ వుంది. వారం వారం పలుకులు పలకడం మాత్రమే సరిపోదు. ఆ పలుకుల్లో నిఙాయతీ వుండాలి. సరైన వాదన వుండాలి. అన్నింటికి మించి కొత్త పాయింట్లు వుండాలి

అలా చూసుకోనంత కాలం ఈ పలుకులు ములుకులు కాలేవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?