‘నిశ్శబ్ద విప్లవం’ ఆత్మవంచనకు మరోపేరు!

రాజకీయ పార్టీలు రకరకాల రూపాల్లో ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ‘నిశ్శబ్ద విప్లవం’ అనే పదం కూడా ఒకటి. ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ.. పోలింగుకు ముందుగా రకరకాల మాయమాటలు చెబుతూ ఉంటుంది. ఎట్టి…

రాజకీయ పార్టీలు రకరకాల రూపాల్లో ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ‘నిశ్శబ్ద విప్లవం’ అనే పదం కూడా ఒకటి. ఎన్నికల్లో ఓడిపోయే పార్టీ.. పోలింగుకు ముందుగా రకరకాల మాయమాటలు చెబుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది తామేనని వాక్రుచ్చుతుంటుంది. 

ఓటమి ఖరారు అయ్యేవరకు కూడా.. గెలుపు మాటలు చెబుతూ ఓటర్లను మభ్యపెట్టడం అనేది రాజకీయాల్లో చాలా సాధారణమైన ఓ ఎత్తుగడ! ఈ ఎత్తుగడల్లో కరాస్త ఇంప్రొవైజ్డ్ రూపం.. ‘నిశ్శబ్ద విప్లవం’ అనే పదం. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పతనం అయిన కాంగ్రెస్, గుజరాత్ లో ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బిజెపికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్న వేళ.. ఆ అంచనాలన్నీ అబద్ధాలని.. ప్రజల్లో ‘నిశ్శబ్ద విప్లవం’ ఉన్నదని, కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రాబోతున్నదని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెలవివ్వడం గమనార్హం. 

గుజరాత్ లో 27 ఏళ్ల బిజెపి పాలన పట్ల విసిగిపోయి ప్రజలంతా నిశ్శబ్దంగా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారట. ఒకవేళ ఖర్గే మాటలు నిజమే అనుకున్నా.. బిజెపిని ఓడించాలని అనుకున్నా.. కాంగ్రెస్ కు పట్టం కడతారని ఆయన ఎలా ఊహిస్తున్నారో తెలియదు. ఎందుకంటే.. ఢిల్లీలో మంచి పాలన అందిస్తున్నట్టుగా అనేక రకాలుగా నిరూపించుకున్న ఆప్ కూడా అక్కడ ప్రధానంగా బరిలో ఉంది. ఆ మాటకొస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువగా చీలుతుంది కూడా. 

ఇలాంటి విశ్లేషణల్ని ఖర్గే కొట్టి పారేయడం లేదు. నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారే గానీ.. ఆప్ ను ఆయన విమర్శిస్తూ.. ఎవరో ఆదేశిస్తే వారిక్కడ పోటీచేస్తున్నారని.. 181 స్థానాల్లో పోటీచేయడం అంటే కేవలం కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టడం తప్ప వారికి ఇంకో లక్ష్యం లేదని అనడం ద్వారా.. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేనేలేదని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నట్టుగా ఉంది.చివరికి ఆప్ పార్టీ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తోంటే.. వారికి అంత డబ్బు ఎలా వస్తుందంటూ ఖర్గే  అనడం తమాషా. 

‘నిశ్శబ్ద విప్లవం’ ఉంది గెలవబోయేది మేమే అని చెప్పుకునే వైఖరి పెద్ద ఆత్మవంచన. ఆ మాటను ఈసారి ఖర్గే గుజరాత్ ఎన్నికలతో మరోమారు నిరూపించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే.. ఈ నిశ్శబ్ద విప్లవం అనే పదానికి ఆంద్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం ఉంది. ఇక్కడ జగన్ సంక్షేమ పరిపాలన పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం అవుతోండగా.. ‘లేదులేదు ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం’ ఉన్నదని విపక్షాలు యాగీ చేయడం తరచుగా జరుగుతోంది. వాళ్లందరూ కూడా తాము చెబుతున్న మాటలు ఆత్మవంచన మాత్రమే అని తెలుసుకునే రోజు కూడా వస్తుంది.