మోడీ మీద హాట్ కామెంట్స్ చేసిన కాంగ్రెస్ నేత

నరేంద్ర మోడీ మంచి మాటకారి. ఆయన వ్యూహాలు కూడా ప్రత్యర్ధులకు అసలు అర్ధం కావు. అవి అర్ధమయ్యేలోగానే అక్కడ ఆపరేషన్ పూర్తి అవుతుంది అంటారు. అటువంటి మోడీని గట్టిగా నిలదీసి మాట్లాడే డేరింగ్ కూడా…

నరేంద్ర మోడీ మంచి మాటకారి. ఆయన వ్యూహాలు కూడా ప్రత్యర్ధులకు అసలు అర్ధం కావు. అవి అర్ధమయ్యేలోగానే అక్కడ ఆపరేషన్ పూర్తి అవుతుంది అంటారు. అటువంటి మోడీని గట్టిగా నిలదీసి మాట్లాడే డేరింగ్ కూడా ఎవరికీ లేకుండా పోతున్న పరిస్థితి దేశంలో ఉంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం మోడీని బాగానే టార్గెట్ చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి మోడీ నిర్ణయించిన నేపధ్యంలో విశాఖలో ఉక్కు కార్మికులకు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ సర్కార్ మీద నిప్పులే చెరిగారు.

మోడీ అబద్ధాలు ఆడే దేశానికి ప్రధాని అయ్యారని నిందించారు. స్విస్ బ్యాంకులలో మూలుగుతున్న‌ నల్లధనాన్ని తీసుకుని వచ్చి ప్రతీ భారతీయుని ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని 2014 ఎన్నికల వేళ మోడీ చెప్పారని గుర్తు చేశారు.

ఇక తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా మోడీ చెప్పారని, చివరికి దాన్ని ఏం చేశారో అందరికీ తెలిసిందే అంటూ వీహెచ్ మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులే నయం, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ఇతరులకు అద్దెకు మాత్రమే ఇచ్చారని, మోడీ ప్రభుత్వం ఏకంగా తెగనమ్ముతోందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపటి రోజున దేశాన్నే అమ్మేస్తారు అని కూడా ఆయన హెచ్చరించారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాను ప్రాణ త్యాగనికైనా సిద్ధమని హనుమంతరావు చెప్పడం విశేషం.