విశాఖ…వీవీఐపీ

విశాఖపట్నం. పుట్టుకతోనే రాజయోగాన్ని వెంట తెచ్చుకుంది. అందుకే ఎపుడూ కూడా నంబర్ వన్ సిటీగానే ఉంది. విశాఖ రాజసానికి ఏమి తక్కువ. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి భాగ్యనగరం ఉన్నా కూడా విశాఖ…

విశాఖపట్నం. పుట్టుకతోనే రాజయోగాన్ని వెంట తెచ్చుకుంది. అందుకే ఎపుడూ కూడా నంబర్ వన్ సిటీగానే ఉంది. విశాఖ రాజసానికి ఏమి తక్కువ. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి భాగ్యనగరం ఉన్నా కూడా విశాఖ వెలుగులు ఎక్కడా తగ్గలేదు.

ఇక విభజన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అయిదేళ్ల పాటు విశాఖే రాజధాని అన్నంతగా తళుకులొలికింది. ఇదిలాఉండగా, గత కొద్ది నెలలుగా విశాఖలో అధికారుల పర్యటనల జోరు పెరిగింది.

అమరావతి నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వచ్చి విశాఖలోని పలు భవనాలను పరిశీలించివెళ్లారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుతో పాటు, సచివాలయం, సిబ్బంది నివాసాలు, ఇతర అవసరాల కోసం సరిపడా భవనాలను కూడా స్వయంగా పరిశీలించి వెళ్లారని భోగట్టా.

ఆ తరువాత చూసుకుంటే డీజీపీ గౌతం సవాంగ్ కూడా విశాఖలో రెండు రోజుల పాటు మకాం వేసి అన్ని రకాలుగా వాకబు చేశారు. విశాఖలోని గ్రౌహౌండ్స్ భవనాలను, కాపులుప్పాడలోని ఐటి సెజ్‌ను కూడా ఆయన పరిశీలించారు. ఇక, ప్రభుత్వ స్ధలాలు, ఖాళీగా ఉన్న భూములను కూడా చూసి వెళ్లారు. ఆయన సైతం అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరలోనే రాజధాని వస్తోందన్న సంకేతాలు ఇచ్చేశారు.

ఇక ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి కూడా ఆ మధ్యన విశాఖ పర్యటన చేశారని కూడా సమాచారం వచ్చింది. ఆమె విశాఖలోని ముఖ్యమంత్రి నివాసం, క్యాంప్ ఆఫీసులకు అనువైన స్ధలాన్ని కూడా ఎంపిక చేశారని చెబుతారు.

వీరే కాదు, తరచూ అమరావతి నుంచి విశాఖకు వచ్చే ఉన్నతాధికారుల తాకిడి ఎక్కువైపోయింది. తరచూ ఎర్ర బుగ్గ కార్లు విశాఖ రోడ్ల మీద జోరుగా పోతూంటే సామాన్యుడికి సైతం అర్ధమైపోతోంది, విశాఖకు రాజధాని తరలింపు ఎంతో దూరం లేదని, ఆ విధంగా విశాఖ సాగరతీరంలో అధికార హడావుడి మొదలైపోయిందనే చెప్పాలి.

నిజానికి విశాఖను ఈనాడు రాజధాని కాదని అంటున్న చంద్రబాబు కూడా తన హయాంలో ప్రతీ నెలలో మూడుసార్లు ఇక్కడికే వచ్చేవారు. చంద్రబాబు ఏ సదస్సు పెట్టినా విశాఖే వేదిక అయింది. ఆ విధంగా విశాఖ ఎపుడూ రాచఠీవిలో అలరారుతూనే ఉంది.

ఇక, ఏడు నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం నిండు సభలో విశాఖే మన  పాలనా రాజధాని అంటూ భారీ ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా విశాఖను రాజధాని చేస్తామని కోట్లాది మంది ప్రజల సాక్షిగా మాట ఇచ్చారు.

జగన్ మాట అంటే ప్రజలేక కాదు, ప్రతిపక్షాలకూ అంత గురి. అందుకే నాటి నుంచి విష ప్రచారానికి తెర లేచింది. విశాఖ దేశంలోని మెట్రోపాలిటిన్ సిటీలలో ఒకటిగా ఉంది. అటువంటి నగరాన్ని పట్టుకుని ప్రమాదాలకు నిలయం, విలయాలకు  కేంద్రమంటూ తప్పుడు రాతలూ చేతలతో విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

విశాఖలో నిండా రసాయన పరిశ్రమలు ఉన్నాయని, అవి అంటుకుంటే విశాఖ బూడిదేనని కూడా చెప్పారు. విశాఖలో హుదూద్ తరహా తుపాన్లు వస్తాయని, దాంతో, నగరం కనుమరుగేనని జోస్యం చెప్పారు. ఇపుడు సునామీ భయాన్ని నింపారు. విశాఖ ఆనవాళ్లు లేకుండా మొత్తం సాగరగర్భంలోకి వెళ్లిపోతుందని సరికొత్త భయాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే విశాఖ జనం మాత్రం వీటిని ఎట్టి పరిస్థితులోనూ నమ్మడంలేదు, విశాఖవాసులు ఎపుడూ  ప్రగతి కాముకులు, అంతే కాదు, అభ్యుదయవాదులు,  మార్పు కోరుకుంటారు, ఆ చైతన్యం జనాలలో ఉంది. విశాఖతో పాటే తామూ ఎదుగుతూ పదుగురికి చోటిస్తూ దేశంలోనే కాదు, ప్రపంచ పటంలో విశాఖ నగరం నిలవాలన్నది విశాఖ భూమి పుత్రుల ఆకాంక్ష.

ఇక, విశాఖజనాలకు తెలుసు. ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే తప్పరని, విశాఖను ఆయన ఆరు నూరైనా రాజధాని చేసి తీరుతారని కూడా వారికి విశ్వాసం ఉంది. అందుకే పల్లదనంతో కూడిన ప్రతిపక్షాల మాటలను ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు, విశాఖలోనే పుట్టి పెరిగిన తమ కంటే ఈ నగరం గురించి ఎవరికి తెలుసు అని కూడా అంటున్నారు.

ఎపుడో వందేళ్లకు ఒకసారి వచ్చే హుదూద్ తుపాన్లు కూడా విశాఖకు ఉన్న ప్రాకృతిక స్వభావరిత్యా, విశాఖ చుట్టూ ఎత్తైన కొండల రక్షణ కవచంగా ఉన్న రిత్యా ఏ మాత్రం ప్రమాదం చేయవని కూడా సగటు విశాఖ వాసికి బాగా తెలుసు. ఇక సునామీల వంటి భయాలు ఏవీ లేవని ఎన్నో సార్లు విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలోనే నిర్వహించిన అనేక సదస్సులు తేల్చి చెప్పాలి,

ఇక చాలా పరిశోధనలలో కూడా విశాఖ కంటే భద్రత కలిగిన నగరం మరోటి లేదని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇపుడు విశాఖ చుట్టూ భయపెట్టే రాజకీయాన్ని చూసి జనం కనీసంగా కూడా పట్టించుకోవడంలేదు. మూడు జిల్లాల ప్రజలలో కొత్త ఆశలు మొలెకత్తుతున్నాయి.

ఇంతకాలం ఈ ప్రాంత వాసులు ఉపాధి కోసం వేరే చోటకు వెళ్లేవారు, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాలుగా ఉత్తరాంధ్రను చెప్పుకుంటారు. అందువల్ల రాజధాని నగరం కనుక వస్తే తమ కష్టాలు తీరుతాయని, ఇక్కడే బతుకు తెరువు దొరుకుతుందని ఆశాపడుతున్న వారు నూటికి తొంబయి శాతం ఉన్నారు..

అలాగే, బీసీలు, బడుగులు ఉన్న ఉత్తరాంధ్ర స్వాతంత్య్రం ముందు నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఉమ్మడి మద్రాస్ రాష్ర్టంలో ఉన్నపుడు కూడా వందల కిలోమీటర్ల దూరంగా రాజధాని ఉండేది. ఆ తరువాత ఆంధ్రరాష్ర్టం ఏర్పాటయ్యాక కర్నూల్ రాజధానిగా ఉంది. ఆ తరువాత దాదాపుగా అరవై ఏళ్లకు పైగా హైదరాబాద్ రాజధాని, గడచిన ఆరేళ్లుగా అమరావతి రాజధానిగా చెబుతున్నారు. ఈ రాజధానులన్నీ కూడా ఉత్తరాంధ్రకు కడు దూరంగా ఉన్నవే. దాంతో, అదే రాజధాని తమ ముంగిటకు వస్తూంటే కాదనే అమాయకత్వంలో ఇంకా ఈ జిల్లాల జనంలేరన్నది వాస్తవం.

ఇక విశాఖ సహా, ఉత్తరాంధ్ర జిల్లాలలోని విపక్షాలు కూడా రాజధాని విషయంలో రెండుగా చీలిపోయాయి. తెలుగుదేశం పార్టీకి సొంత పార్టీలోనే  మద్దతు కరవు అవుతోంది. అలాగే, బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వంటి వారు విశాఖ రాజధానికే తమ మద్దతు అంటున్నారు. ఈ నేపధ్యంలో రాజధాని  విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం కానీ, ఇతర పార్టీలు కానీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ అసలు నమ్మడంలేదన్నది నిజం.

మొత్తానికి విశాఖవాసులు ఇన్నాళ్లూ ఏదీ అడగలేదు, ఇపుడు వచ్చిన రాజధానిని కాదనుకోరని కూడా మేధావులు, విశాఖ అభివృద్ధి కాముకులు అంటున్నారు.. సమయం, రోజూ చెప్పలేము కానీ విశాఖకు రాజధాని కచ్చితంగా వచ్చి తీరుతుందన్నది ఇక్కడ సగటు జనం మాట.

పవన్ కళ్యాణ్ మనిషే అదో టైప్