షర్మిల రేంజి పెంచుతున్న తెలంగాణ సర్కారు!

తెలంగాణ సర్కారు స్వయంగా పూనుకుని వైఎస్ షర్మిలను నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నదా? పోరాట యోధురాలిగా తనను తాను మలచుకోవడానికి వరుస అవకాశాలను కల్పిస్తున్నదా? ప్రస్తుతం ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. ఇప్పటికి 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి…

తెలంగాణ సర్కారు స్వయంగా పూనుకుని వైఎస్ షర్మిలను నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నదా? పోరాట యోధురాలిగా తనను తాను మలచుకోవడానికి వరుస అవకాశాలను కల్పిస్తున్నదా? ప్రస్తుతం ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. ఇప్పటికి 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన షర్మిల.. తిరిగి తన పాదయాత్రను ప్రస్తుతానికి కొనసాగించకుండా ఆపుకోవలసి వచ్చింది. 

వరంగల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగించడానికి ఆమె అక్కడి పోలీస్ ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు.. ఆ అభ్యర్థనను ఎందుకు తిరస్కరించకూడదో తెలియజేయాలని ఆయన పార్టీ నేతలకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. గతంలో అనుమతులు ఇచ్చినప్పుడు… పాదయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. వ్యక్తిగత దూషణలకు పాల్పడి ఉద్రిక్తతలు రేగడానికి కారకులయ్యారని ఆయన ఆధారాలను కూడా ఆ షోకాజ్ నోటీసుకు జత చేశారు. దీంతో ప్రస్తుతానికి షర్మిల తన పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తిరిగి ఎప్పుడు కొనసాగించేది.. తర్వాత ప్రకటిస్తారు!

అయితే ఇలాంటి ప్రతిబంధకాలను సృష్టించడం ద్వారా తెలంగాణ సర్కారు స్వయంగా షర్మిలను మహా నాయకురాలుగా తీర్చిదిద్దుతున్నదా? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే ప్రతి బంధకాలు ఎదురైనప్పుడే వాటిని ఉపయోగించి ముందుకు వెళ్లడం అనేది వ్యక్తులు ఎవరికైనా అలవాటు అవుతుంది. జీవితం మొత్తం సాఫీగా సాగిపోతే అందులో మజా ఏమి ఉండదు. తెలంగాణలో ఒంటరిగా, క్లిష్టమైన రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉన్న షర్మిల ఈ రంగంలో మరింతగా రాటు తేలడానికి తగినట్టుగా కేసీఆర్ సర్కారు ఈ ఇబ్బందులను సృష్టిస్తున్నదా అనిపిస్తుంది.

మొన్నటికి మొన్న పాదయాత్రలో జరిగిన రభస, షర్మిల మీద దాడి, గాయపడడం, ఆమె కాన్వాయ్ లోని వాహనాలను ధ్వంసం చేయడం, ఆమె అరెస్టు వ్యవహారాలను తెలంగాణ పౌర సమాజం గమనించింది. ఏకంగా ప్రగతి భవన్ ముట్టడించడానికి బయలుదేరిన షర్మిల పట్ల పోలీసులు ఎంత అనుచితంగా ప్రవర్తించారో అతి చేశారో కూడా ప్రజలు గమనించారు. తెలంగాణ ప్రజల దృష్టిలో షర్మిల ఇమేజ్ గ్రాఫ్ ఒక్కసారిగా లంబంగా పెరిగింది. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే రాని క్రేజ్ రెండు రోజుల రాద్ధాంతం రభసతో వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఆ పరిణామాలతోనే షర్మిలకు తెలంగాణ ప్రజలలో ఒక హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది.

దానికి తోడు తర్వాత ఆమె పాదయాత్ర కొనసాగించకుండా పోలీసులు ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇలాంటి ప్రతిబంధకాల వలన ప్రజలు ఆమెను మరింత సానుభూతితో చూస్తారు తప్ప షర్మిల కోల్పోయేదేమీ ఉండదు. కమ్యూనికేషన్ అనేది ప్రతి మనిషి అరచేతిలో ఇమిడిపోయిన ఈ రోజుల్లో.. కెసిఆర్ ప్రభుత్వం పై షర్మిల వేయదలుచుకున్న ప్రతి నింద, చేసే ప్రతి ఆరోపణ ప్రజలందరికీ చేరడం చాలా సులభమైన విషయం.

వాగ్దాటి పుష్కలంగా ఉన్న షర్మిల ఇంట్లో కూర్చుని అయినా ప్రతిరోజు కేసీఆర్ సర్కార్ మీద విమర్శలతో దాడి చేయకుండా ఉంటారని అనుకోలేము. మరి ప్రభుత్వం షర్మిలను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నదా, ఆ ప్రయత్నంలో ఆమె మరింతగా ఎత్తుకు ఎదగడానికి సహకరిస్తున్నదా అనేది వేచి చూడాలి.