రాయలసీమ అభివృద్ధి గురించి, ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్లడం గురించి జగన్, చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు చిత్తశుద్ధి లేనే లేదుట. ఈ నాయకులు కేవలం మాటలతో మోసం చేస్తున్నారట. రాయలసీమ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక కృషి చేయడం లేదుట. రెండు పార్టీలకు చెందిన ఈ ముగ్గురు నాయకులూ సీమకు ద్రోహమే చేస్తున్నారని.. ఈ సమయంలో అనగలవారు ఎవరుంటారు? ఇంకెవరు, కొందరు బిజెపి నాయకులు కలిసి ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కలిపి పార్టీల మీద నింద వేస్తున్నారు.
కమలదళం వాదన నిజమేనని కొంతసేపు అనుకుందాం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబుకు, రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కొడుకు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు, కీలక నాయకుడు పెద్దిరెడ్డికి లేకపోతే ఎవరికి చిత్తశుద్ధి ఉన్నదని అనుకోవాలి. ఆ విషయం కూడా ఆయనే చెబితే బాగుంటుంది. బహుశా రాయలసీమ అభివృద్ధి పట్ల తమ భారతీయ జనతా పార్టీకి తప్ప మరెవ్వరికీ చిత్తశుద్ధి లేదని వాళ్లు అంటారేమో. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తేలేదని, జాకీ, అమరరాజా వంటి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అంటున్న బిజెపి నాయకులు.. తమ పార్టీకి ఉన్న చిత్తశుద్దికి ప్రతీకలుగా ఒకటి రెండు ఉదాహరణలైనా చెబితే బాగుంటుంది.
ఇవాళ మూడురాజధానులకు అనుకూలంగా సీమగర్జన సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అందులో పాల్గొని సీమకు న్యాయం జరగాలని, తాము కూడా మద్దతిస్తున్న కర్నూలులో హైకోర్టు అనే ప్రతిపాదన కోసం తమ పార్టీ తరఫున కూడా ఆ సభలో పాల్గొనాల్సింది బదులుగా.. సభకు ముందు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
భారతీయ జనతా పార్టీ కూడా కర్నూలులో హైకోర్టు అనే డిమాండ్ ను ఇదివరకరటి నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు మూడు రాజధానులకు అనుకూలంగా కర్నూలులో సభ జరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా కర్నూలుకు హైకోర్టు కావాల్సిందే అనే డిమాండు మాత్రమే కదా వినిపించబోయేది. మరి అదే డిమాండ్ ను ఎంతో కాలం కిందటే తీసుకున్న బిజెపి కూడా ఈ సభలోపాల్గొనాలి కదా.
అసలు భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సీమగర్జనకు హాజరు కావాలి. వాళ్లకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రప్రభుత్వం నుంచి రాయలసీమకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ తీసుకువస్తే వాళ్లకు పాలాభిషేకాలు చేయొచ్చు. ప్రత్యేకహోదానే గనుక తీసుకువస్తే పాదనమస్కారాలు కూడా చేయవచ్చు. అదేమీ చేతగాని సీమ బిజెపి నాయకులు.. నిస్సిగ్గుగా ప్రెస్మీట్ పెట్టి.. జగన్, చంద్రబాబు, పెద్దిరెడ్డి లు సీమకు ఏమీ చేయలేదని, చిత్తశుద్ధి లేదని అనడం కామెడీ కాక మరేమిటి?