వైసీపీ రాజకీయాల్లో పీకే టీం పాత్ర కీలకంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సర్వేల వరకే ప్రశాంత్ కిశోర్ టీం పరిమితమైంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా రాజకీయాలు చేయడం ప్రారంభించింది. తామేం చేయాలో, చేయకూడదో పీకే టీం ఆదేశాలు ఇస్తుండడాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తమ ప్రాంత స్థితిగతులు తమకంటే పీకే టీంకు ఏం తెలుసని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పీకే టీం జనంలో విస్తృతంగా తిరుగుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధులు, ఆశావహులపై జనాభిప్రాయాల్ని సేకరిస్తోంది. ఎప్పటికప్పుడు సీఎంకు నివేదిక పంపు తోంది. ఇదిలా వుండగా న్యాయ రాజధానికి మద్దతుగా కర్నూలులో ఈ నెల 5న తలపెట్టిన భారీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు పీకే టీం రంగంలోకి దిగింది.
రాయలసీమ వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నేతలకు పీకే టీం సభ్యులు ఫోన్ చేస్తున్నారు. సభకు ఎంత మందిని జనసమీకరణ చేయాలి, అలాగే ఎలాంటి ప్లెక్సీలు పెట్టాలి, ఎవరెవరిని పిలిస్తే బాగుంటుంది, సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేయడం తదితర అంశాలపై పీకే టీం దిశానిర్దేశం చేస్తోంది. రాజకీయాలు ఎలా చేయాలో తమకు పీకే టీం నేర్పుతోందని వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యంగ్యంగా అంటున్నారు.
పీకే టీం చెప్పినట్టు వినకపోతే తమపై నెగెటివ్ రిపోర్ట్ పంపుతారనే భయాందోళన వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఉంది. పీకే టీం ఆదేశాలపై మనసులో ఎలాంటి అభిప్రాయం ఉన్నా, అఇష్టంగా అయినా ఆచరించక తప్పనిసరి పరిస్థితి. వైసీపీ విధానాలపరమైన నిర్ణయాల్లో పీకే టీం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్న మాట మాత్రం నిజం. ఈ దఫా పీకే టీం ఏం చేస్తుందో చూడాలి.