ఎంత అధికార పార్టీ అయినా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ పాచిక పారేలా కనిపించడం లేదు. కేటీఆర్ పోల్ సర్వేలు నిజమయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది అనుమానంగా మారుతోంది. రోజులు దగ్గరపడే కొద్దీ టీఆర్ఎస్ నేతల్లో ధీమా పెరుగుతున్నా.. నామినేషన్ల చివరిరోజు మాత్రం వారికి చుక్కలు కనపడ్డాయి. ఏకంగా చివరి రోజు 67 మంది అభ్యర్థులు హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 76కు చేరింది.
వీటిలో ఎంతమంది తమ నామినేషన్ ఉపసంహరించుకుంటారనే విషయంపైనే టీఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడ్డాయనడం అతిశయోక్తి కాదు. పోటీచేసే అభ్యర్థుల సంఖ్య 64కి లోపు ఉంటేనే ఈవీఎంలతో పని అవుతుంది లేకపోతే కచ్చితంగా బ్యాలెట్ పోరుపై ఆధారపడాల్సిందే. అంటే హుజూర్ నగర్ లో బ్యాలెట్ ఎన్నిక జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తారు. లేకపోతే బ్యాలెట్ పోరుతప్పదు.
అదే జరిగితే నిజామాబాద్ లోక్ సభ రిజల్ట్ రిపీట్ అవుతుందేమోనని టీఆర్ఎస్ భయపడుతోంది. గతంలో నిజామాబాద్ విషయంలో ఇలానే జరిగింది. స్థానిక పసుపు రైతులు అప్పటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో చివరకు చేసేదేంలేక, ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పోరువైపు మొగ్గుచూపింది. కవిత ఓడిపోడానికి కారణం ఇదే అని చెప్పలేం కానీ, ఇది కూడా ఒక కారణం అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.
ఇక అభ్యర్థులు ఎక్కువైన చోట్ల గుర్తుల లొల్లి కూడా టీఆర్ఎస్ కి చేటు తెచ్చింది. కారు గుర్తులాగే ఈవీఎంలో కనిపించిన రోడ్ రోలర్ తన భవిష్యత్ ని మార్చేసిందన్న ఓ అభ్యర్థి ఆవేదనను మనం కళ్లారా చూశాం. ఇప్పుడు అదే తకరారు రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలా నామినేషన్ల ఘట్టం ముగిసిందో లేదో అలా.. హుజూర్ నగర్ లో అభ్యర్థులను బుజ్జగించే పనిలోపడ్డారు టీఆర్ఎస్ నేతలు. తాయిలాలు కూడా భారీగానే ముట్టజెప్పే ఆలోచనలో ఉన్నారట. మొత్తమ్మీద హుజూర్ నగర్ లో ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకున్న వారికి భారీగానే ముడుపులు అందబోతున్నాయి.